అమరావతి (చైతన్య రథం): ఏపీ చరిత్రలో సోమవారం రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.02 శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త ఒరవడిని సృష్టించింది. రాత్రి 7గంటల సమయానికి మొత్తం 65,18, 496 లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 61,93,115 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడిరచారు. లబ్ధిదారులకు రూ.4,180 కోట్ల మేర నగదు అందజేశారు. విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91 శాతం మందికి పెన్షన్లు ఇచ్చారు. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో క్రియాశీలంగా పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగుల వరకు అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
గతంలో అలా…నేడు ఇలా!
గత ప్రభుత్వ హయాంలో 2.6 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేది. వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని గత ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా పెట్టారు. ఆ సమయంలో ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రతిపక్షాలు సూచించినా నాటి ప్రభుత్వం వినిపించుకోలేదు…పైగా వాలంటీర్లతో మాత్రమే పింఛన్ల పంపిణీ సాధ్యమన్నట్లుగా వ్యవహరించింది. దీంతో సచివాలయాలకు పింఛను కోసం వెళ్లి పలువురు వృద్దులు ఎండలకు తీవ్ర అవస్థలు పడ్డారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అయితే వాలంటీర్లు ప్రస్తుతం అందుబాటులో లేకున్నా.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేడు కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేపట్టింది. రాష్ట్రంలోవున్న 1.3 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా జులై 1 సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించింది. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు అందుబాటులో ఉన్నా ఒక రోజులో గరిష్టంగా 88 శాతం మందికి మాత్రమే పింఛను పంపిణీ చేశారు. 2023 జులై 1వ తేదీన 88.44 శాతం మందికి మొదటి రోజు పింఛన్లు అందజేశారు. అయితే నేడు వాలంటీర్లు లేకపోయినా….సచివాలయ ఉద్యోగుల ద్వారా కూటమి ప్రభుత్వం 95 శాతం పైగా పంపిణీ ఒక్క రోజులో పూర్తి చేసింది. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా 95 శాతం పంపిణీ పూర్తి చేయడం గమనార్హం.