- నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం
- దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీఎన్డీఎంఏ
- రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష
- ప్రమాద నివారణ చర్యల సూచించిన చంద్రబాబు
విజయవాడ (చైతన్య రథం): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలావుంటే `నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు.. నెల్లూరుకు 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే `ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎన్టీఆఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నిన్నటి నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై బుధవారం అధికారులతో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఇదిలావుంటే.. నెల్లూరు నగరంతో పాటు కావలి, అల్లూరు, బిట్రగుంట, గుడ్లూరు, లింగసముద్రం, వింజమూరు, వరికుంటపాడు, ఇందుకూరుపేట, కొండాపురం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగులోకి వరద చేరుతోంది. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, రాజుపాలెం, కొత్తపట్నం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. తీరప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తోపాటు 360మంది పోలీసులతో 18 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. కడప బస్టాండ్‌లోకి భారీగా వరదనీరు చేరింది. పోరుమామిళ్ల, ఒంటిమిట్టలో అత్యధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి- తడమార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. తిరుమల కనుమ రహదారుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి పాదాలు, జాపాలి, ఆకాశగంగకు భక్తులను అనుమతించడం లేదు. వర్షాల కారణంగా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే.
తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. జేసీబీల ద్వారా సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను తితిదే అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది. రాజీవ్ గాంధీ కాలనీ, ఆటోనగర్, కొరమీనుగుంటలో వరద వస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై నీరు ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్ కలెక్టరేట్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీరప్రాంతాల్లో, వాకాడు, తడ, కోట, సూళ్లూరుపేట, చిల్లకూరులో వర్షం కురుస్తోంది.
రేణిగుంట రన్ వేపై నీరు
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేణిగుంట రన్‌వేపైకి నీరు చేరింది. ల్యాండిరగ్ సమస్య తలెత్తడంతో ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరాల్సి ఉంది.