- మంత్రి నారా లోకేష్‌కు వినతుల వెల్లువ
- విశాఖ పార్టీ కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు
- రెండోసారి ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
విశాఖపట్నం(చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖలోని జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు ఉదయం ఒకసారి ప్రజాదర్బార్ నిర్వహించినప్పటికీ, వివిధ సమస్యలతో బాధపడుతూ వచ్చిన వారి కోసం మంత్రి లోకేష్ మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో పలువురు మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతగొందిలో గిరిజన కుటుంబానికి చెందిన ఐసరం రత్నాలమ్మ.. మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఇటీవల తన భర్త అనారోగ్యానికి గురై మరణించాడని, ముగ్గురు పిల్లల పోషణ భారంగా మారిందని కన్నీటిపర్యంతమయ్యారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనకు ఏదైనా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత అభ్యర్థులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించి గిరిజన ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయాలని పాడేరుకు చెందిన కిల్లు వెంకట రమేష్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరు శివారులోని మెడిటెక్ ఏఎంటీజడ్కు 200 మంది రైతుల నుంచి భూములు సేకరించారని, వాటికి పరిహారం చెల్లించడంతో పాటు జోన్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంఏ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఎస్జీటీ పోస్టులను మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో చేర్చాలని ఎస్.ఆలమ్ రాజా, అబ్దుల్ రజాక్ కోరారు.
విశాఖలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆటోనగర్‌కు కేటాయించిన భూమిని ప్లాట్లుగా విభజించి అర్హులకు కేటాయించాలని స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ అండ్ స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2015 నుంచి అతిథి అధ్యాపకులగా పనిచేస్తున్న వారిని ఎంటీఎస్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ వ్యవస్థలో విలీనం చేయాలని ఏపీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల గెస్ట్ అధ్యాపకుల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలో కలిసి ఫోటోలు దిగారు.