విశాఖపట్నం: తనపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి వేసిన పరువు నష్టం కేసులో రాష్ట్ర విద్య, ఐటీి శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖలో 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి` రూ. 25 లక్షలండి’ శీర్షికన సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షిపై మంత్రి లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంపై ఈ కేసు దాఖలు చేశారు. గత ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. శుక్రవారం మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు మంత్రి హాజరయ్యారు.
సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. సాక్షి పత్రిక నోటీసులకు స్పందించకపోవడంతో లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని లోకేష్ స్పష్టం చేశారు.