- నీరు కలుషితం కాకుండా చర్యలు
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ
- గుర్లలో డయేరియా బాధితులకు పరామర్శ
విజయనగరం(గుర్ల) (చైతన్యరథం): విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం డయేరియా బారినపడిన వారికి అత్యుత్తమ వైద్యసహాయం అందిస్తున్నామని, వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డయేరియా ప్రబలిన సమాచారం అందిన వెంటనే గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించడంతోపాటు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి వారికి అందుతున్న వైద్యసహాయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డయేరియా బారినపడిన గుర్ల గ్రామాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం సందర్శించారు. డయేరియా బాధితుల చికిత్సకోసం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి వైద్యాధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రికి వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ) డా. ఎస్ భాస్కరరావు, గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వెంకటేశ్వరరావు వివరించారు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై అధికారులతో మంత్రి చర్చించారు. పలు బోర్ల నుంచి నమూనాలు సేకరించగా కొన్నింటి నుంచి భూగర్భ జలాలు కలుషితం అయినట్టు రిపోర్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై కూడా రిపోర్టులు సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఈ నివేదికలన్నీ సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నీరు కలుషితం కావడానికి కారణాలపై ఒక అంచనాకు రావాలని చెప్పారు. అప్పటివరకు గ్రామస్థులకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామంలోని బోర్లను, నీటి పథకాలను వినియోగించకుండా నివారించాలని సూచించారు. నీరు కలుషితం కావడానికి కారణాలు తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే గ్రామంలోని తాగునీటి పథకాలు, బోర్లు వినియోగించేలా గ్రామస్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. శిబిరంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో 22 మంది, ఘోషా ఆసుపత్రిలో 18 మంది, చీపురుపల్లిలో ఏడుగురు, విజయనగరం సర్వజన ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారని, ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.భాస్కరరావు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత ఐదు రోజులుగా ఇక్కడి పరిస్థితులపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. గ్రామంలోని పలు రకాల నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నామని, త్వరలోనే కారణాలపై ఒక నిర్ధారణకు వస్తామన్నారు. గ్రామంలోని వ్యర్థాలను చంపావతి నదిలోకి విడిచిపెట్టడం కూడా నీరు కలుషితం కావడానికి ఒక కారణంగా గుర్తించామన్నారు. భవిష్యత్తులో వ్యర్థాలను నదిలోకి విడిచిపెట్టకుండా చర్యలు చేపడతామన్నారు. పైనున్న గ్రామాలు వ్యర్థాలు నదిలోకి విడిచిపెట్టకుండా నివేదిక అందించాలని డీపీఓను ఆదేశించామన్నారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని, ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. తాగునీటి పరీక్షల నివేదికల్లో భూగర్భ జలాలు కలుషితం అయినట్లు నిర్ధారణ జరిగితే దానిని నివారించే చర్యలు చేపడతామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్ పద్మావతి కూడా పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట చీపురుపల్లి ఆర్డీఓ సత్యవాణి, గ్రామీణ నీటిసరఫరా ఎస్ఈ ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.