విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పీఠాధిపతి కంటే ఇరు తెలుగురాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడిగానే గుర్తింపు ఎక్కువ. రాజకీయ నాయకులే కాదు… అధికారులూ స్వాములోరి ప్రసన్నం కోసం క్యూ కట్టేవారు. ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాను అని ప్రకటించుకునే స్వామీజీలకు రాజకీయా లతో పనేంటి? నాయకులను పొగడ్తలతో ముంచేయాల్సిన అవసరం ఏమిటి? అంటే అవసరమే అని సెల విస్తుంటారు స్వాములోరు. వైసీపీ హయాంలో విశాఖ స్వామి చక్రం బాగానే తిప్పారు. జగనోరిని 2019లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు యజ్ఞయాగాలూ చేయించి ఆయన హయాంలో రాజగురువుగా వెలుగొందారు. ‘‘అగ్నిసాక్షిగా చెబుతున్నాను నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ అంటూ తన ప్రియశిష్యుడిపై ఆప్యా యత నూ చాటుకున్నారు. జగన్మోహనరెడ్డి 15 ఏళ్లు దిగ్విజయంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆకాంక్షించారు’’ కూడా.
వివాదాస్పదం రాజగురువు భోగాలు
సాధారణంగా స్వాములు, బాబాలు అంటే సత్సంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలా సాలు త్యజించి, తాత్వికాన్వేషణ దిశగా జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక బోధనలతో ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే శారదాపీఠం స్వాములోరు రూటే వేరు..ఆయన చేసే పూజలు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. సామాన్య భక్తులు భరించలేరు… కేవలం రాజకీ య పెద్దలకే ఆయన ఆశీర్వచనం దక్కుతుంది. ముఖ్యమంత్రి కావడానికి ప్రజాభిమానం కంటే ఇలాంటి కాస్ట్‌లీ స్వాములోరి పూజలను నమ్ముకున్నాడు జగన్‌రెడ్డి. శ్రీకాకుళంలోని అరస వల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానాలలో 2020లో విశాఖపట్నం శారదా పీఠాధిప తి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి జన్మదిన వేడుకలను ఆర్బాటంగా జరిపాడు. అంతేనా..అప్పటి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలకడం వివాదాస్పదమైంది. అదలా ఉంటే గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2/2 గన్‌మెన్ లు, ఎస్కార్ట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహిం చేవారు. స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్ వాహనం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదా పీఠం ప్రవేశ ద్వారం వద్దే మూడు షిఫ్ట్‌లలో 15 మంది ఉండేవారు. అంతలా ఆయన రాజభోగం కొనసాగింది.
గురుశిష్యుల దోపిడీ
తన పాలనలో రాజగురువుగా ఒక వెలుగు వెలిగిన స్వాములోరికి ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని జగనోరు అప్పనంగా కట్టబెట్టి తన స్వామిభక్తి చాటుకున్నాడు. స్వాము లోరి పూజలకు దక్షిణగా శారదా పీఠం కార్యకలాపాల విస్తరణ, సంస్కృత పాఠశాలకు భూమి కేటాయింపు, పనిలో పనిగా భారీ స్టార్ హోటల్ నిర్మించుకునేందుకు ఆగమేఘాల మీద జీవో జారీ చేసి మరి సకల అనుమతులు కట్టబెట్టేయటం చకచకా జరిగిపోయాయి. తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆదాయార్జన పనులు కూడా చేపడతామని, అనుమతి ఇవ్వాలని పీఠం 2023 నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. రాజగురువు అడిగితే కాదనేదేముంది..దొంగ శిష్యుడు చకచకా ఫైల్ కదిపించాడు. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకానికి వచ్చే భీమిలి సముద్ర ఒడ్డున అనగా భీమిలి మండలం కొత్తవలసలో సర్వే నెంబర్ 102/2లో 7.7 ఎకరాలు, 103.2లో 7.3 ఎకరాలు.. మొత్తం 15 ఎకరాలను ఆ దొంగ స్వామికి ఈ దొంగ శిష్యుడు భూములను కేటాయించాడు. రిజిస్ట్రేషన్ విలువ అప్పటి కలెక్టర్ ఎకరాకు రూ.1.8 కోట్లు సిఫార్సు చేస్తే జగన్ సర్కార్ మాత్రం స్వామి భక్తితో ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేసింది. అంటే 15 ఎకరాలను రూ.15 లక్షలకే ఇచ్చేశారు. ప్రజలకు ధర్మం గురించి ప్రవచనాలు చెప్పే స్వామీజీ వందల కోట్లు విలువ చేసే ఆ భూమిని అలా నామమాత్రపు ధరకు తీసుకోవడం తప్పని భావించలేదు. విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్ లో భూములు ఎంతో విలువైనవి. ఎకరం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంది. ఆ లెక్కన శారదాపీఠానికి ఇచ్చిన భూముల విలువ చూసుకుం టే రూ.250 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఉంటుంది. అంతటితో ఆగకుండా తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చేశాడు జగన్‌రెడ్డి. తనను తాను అధికారికంగా క్రిస్టియన్ అని ప్రకటించుకుని ప్రతి సంవత్సరం జెరూసలెం వెళ్లొచ్చే జగన్ పట్ల ఒక హిందూ పీఠాధిపతికి ఎందుకా వల్ల మాలిన ప్రేమ అంటే..తెరవెనుక నడిచిన ధారాదత్తాలు, భూకబ్జాల నుంచి లబ్ధికోసమేనా అని సుస్పష్టమవుతోంది. స్వాములోరు అందుకేనా విశాఖ రాజధాని అని తెగ ఊగిపోయింది?
భూములు కావాలి.. హిందూమతం అక్కర్లేదా?
ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పిన స్వాములోరు గత జగ నోరి పాలనలో ఆలయాల్లో అపచారాలు, విగ్రహాల విధ్వంసాలు, దొంగతనాలను ఏనాడూ ఖండిరచింది లేదు. ఇటువంటి పనులు తగవని చెప్పింది లేదు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఏం జరిగినా మౌనం పాటించారు. హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చి నా పట్టనట్టే వ్యవహరించారు. సొంత డబ్బుతో పూజలు, దానాలు చేస్తే ఫలితం దక్కుతుంది కానీ, ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తూ ధారాదత్తాలు చేస్తే జగన్మోహన్‌రెడ్డికి ఎలా ఫలితం దక్కుతుంది? ఇలా ప్రజాధనాన్ని దోచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో జగన్‌రెడ్డికి దేవుడు బాగా తెలియజెప్పాడు..11 ఇచ్చి మూలనపడేశాడు. మరోవైపు ఆధ్యాత్మికత కంటే రాజకీయాలను ఎక్కువ ఔపోసన పట్టిన స్వాములోరు..ప్రభుత్వం మారితే తన పరిస్థితి కూడా మారుతుందని గ్రహించకపోవడం వింతగా ఉంది. శారదా పీఠానికి కొత్తవలసలో కేటాయించిన భూమిపై విచారణ జరిపి దాని కోసం జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మరో జీవో జారీ చేసి ఆ భూమిని వెనక్కు తీసుకుంది. దాంతోపాటు తిరుమల కొండపై శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని టీటీ డీని ఆదేశించింది. ‘‘ప్రజల ఆస్తులను దోచుకుతిన్న ఎవరినీ వదిలి పెట్టేది లేదు..నీలాంటి దొంగ భక్తుడైనా..నీ గురువు లాంటి దొంగస్వామి అయినా…తిన్న ప్రతి రూపాయి కక్కిస్తాం’’ అని కూటమి ప్రభుత్వం ప్రక్షాళనకు పూనుకోవడం గురుశిష్యులకు మింగుడు పడని అంశమే.
స్వరూప కొనవల, అనలిస్ట్