న్యూఢిల్లీ (చైతన్యరథం): జాతీయ ప్రాముఖ్యత కలిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ (ఎన్ఎఫ్ఎస్యు) క్యాంపస్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం దేశ రాజధాని ఢల్లీిలో అమిత్ షాను కలిసి ఎంపీ లావు వినతి పత్రం అందజేశారు. ప్రతిష్టాత్మక ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్‌లు ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దురదృష్టవశాత్తూ 2014లో అశాస్త్రీయ విభజనతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ అనేక కేంద్ర సంస్థలను కోల్పోయిందని కూడా కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అమరావతి, విశాఖ నగరాలు ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలన్నారు. ఈ రెండిరటిలో ఏదో ఒక చోట ఎన్ఎఫ్ఎస్యును ఏర్పాటు చేయాలని లావు కోరారు.
కాస్మోపాలిటన్ స్వభావంతో పాటు, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో భారతదేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన విశాఖపట్నం ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్‌కి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. విశాఖపట్నం నగర వ్యూహాత్మక స్థానం, పారిశ్రామిక అభివృద్ధి, కనెక్టివిటీల నేపథ్యంలో ఈ ప్రసిద్ధ సంస్థను నెలకొల్పేందుకు అనువైన ప్రదేశమని తెలిపారు. మరో పక్క అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్కడ పుష్కలమైన భూ లభ్యతతో పాటు, మరో ప్రధాన నగరమైన విజయవాడకు దగ్గరగా ఉందని, అందుకే ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్ ఏర్పాటుకు అమరావతి కూడా అనువైన ప్రాంతమని తెలిపారు. విశాఖపట్నం, అమరావతి రెండిరటికీ ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల్లో ఎక్కడైనా ఒకచోట నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ను మంజూరు చేయాలని కోరారు. ఇది రాష్ట్ర ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో విద్యావకాశాలను, అభివృద్ధి అవకాశాలను మరింత పెంచుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బుడగ జంగాలను ఎస్టీల్లో చేర్చండి
అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న బేడా (బుడగ) జంగం సామాజిక వర్గానికి సంబంధించిన అత్యవసర, దీర్ఘకాలిక సమస్యను అమిత్ షా దృష్టికి ఎంపీ లావు తీసుకొచ్చారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక నిర్మాణంలో ప్రత్యేకమైన, సమగ్రమైన పాత్ర పోషిస్తున్న బేడా జంగం సమాజం.. సామాజిక, ఆర్థిక, జీవనోపాధి పరిస్థితులకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వివరించారు. బేడా (బుడగ) జంగం సామాజికవర్గం… వారి సాంప్రదాయ వృత్తులు, ఆచారాలకు గుర్తింపు పొందిందన్నారు. బుడగ జంగాల గుర్తింపు, జీవనోపాధి, సమగ్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. దీంతో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ప్రస్తుతం వారు తమ కుల ధృవీకరణ పత్రాల కోసం కూడా సరిగ్గా దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని, వారికి సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాల లభ్యత మెరుగుపర్చేందుకు, వారి సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించడం చాలా ముఖ్యమని అమిత్ షా కి తెలిపారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీలో చేర్చాలనే వారి డిమాండ్‌ను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించాలని కోరారు.