- సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ పథకాల అమలు భేష్
- కూటమి నేతల సమష్టి కృషితోనే అఖండ విజయం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తి చూపించాలి
- పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి పిలుపు
- జిల్లా కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి
భీమవరం (చైతన్యరథం): మూడు పార్టీల నేతలు కష్టపడి పని చేయడం కారణంగానే కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరంలో శనివారం నిర్వహించిన పశ్చిమగోదావరి జిల్లా కూటమి సభ్యుల ఆత్మీయ సదస్సులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో తొలిసారి జిల్లాలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి ఈ క్రమంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. ఇందుకుగాను జిల్లాలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో భేటీ అయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాలోని పలు సమస్యలను ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వచ్చే పర్యటన నాటికి సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నేతలు, కార్యకర్తల మీద ఉందని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3000 ఉన్న పింఛన్‌ను ఒక్క సంతకంతో రూ.4000కు పెంచామని గుర్తు చేశారు. రూ. వెయ్యి పింఛను పెంచడానికి జగన్ మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతన్నల భూమి హక్కులను కాపాడామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 22 ఏ లోని భూముల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నేతలు జిల్లాలో ఇసుక సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా… దీనిపై స్పందించిన మంత్రి సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం సూచిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు మూడు రెట్లు అధిక వ్యయం చేసినట్లు కూటమి నాయకులు తెలుపగా మంత్రి గొట్టిపాటి స్పందిస్తూ.. ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని మంత్రి గొట్టిపాటి అన్నారు. గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా పట్టించుకోలేదని దాని ఫలితంగా ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసం రూ. 800 కోట్లకు పైగా కేటాయించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీ నేతలు అంతా కలిసికట్టుగా పట్టభధ్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందరూ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
దీపం`2 సిలిండర్లు పంపిణీ
దీపం`2 పథóకం లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. పేదల కష్టాలు తీర్చేందుకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల కష్టాలు తీర్చేందుకు సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, భీమవరం, ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు ఎమ్మెల్యేలు రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చినబాబు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి, టీడీపీ, జనసేన బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.