- ఈదుపురంలో ముఖ్యమంత్రిని చూసిన మురిసిన జనం
- దీపం లబ్ధిదారు శాంతమ్మ ఇంట్లో టీ తయారు చేసిన సీఎం
- ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు
- ఇచ్చాపురంలో కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేల ఘనస్వాగతం
శ్రీకాకుళం/ ఇచ్చాపురం (చైతన్య రథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం`2 పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు హెలికాప్టర్లో ఈదుపురం చేరుకున్నారు. అక్కడ సుమారు అరగంటపైన సీనియర్ నాయకులతో సమీక్ష జరిపారు. అనంతరం రోడ్డుమార్గం గుండా కిలోమీటర్ దూరంలోని ఈదుపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనాలకు జెండా ఊపి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దీపం పథకం లబ్ధిదారురాలైన అంబటి శాంతమ్మ గృహానికి చేరుకుని, ఆమెకు తొలి సిలిండర్ను పంపిణీ చేశారు. అనంతరం కుశల ప్రశ్నలు వేసి, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయం తెలుసుకున్నారు. శాంతమ్మ ఇంట్లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే టీ తయారు చేసి వారితో టీ తాగుతూ అభివృద్ధి పాలనపై ఆరా తీశారు. ఆయన చేతులతోనే గ్యాస్ వెలిగించి, గిన్నె పెట్టి పాలను అందులో కాచి, టీ పొడి, పంచదార వేసి, గరిటతో కలియతిప్పి స్వయంగా చంద్రబాబు టీ తయారు చేయడంతో శాంతమ్మ కుటుంబం, కార్యక్రమానికి హాజరైన వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
ప్రభుత్వం ఏర్పడిన 143 రోజులుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపట్ల సీఎం చంద్రబాబు పలువురినుంచి అభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం అక్కడ నుంచి ఒంటరి మహిళ లబ్దిదారు బలిజేపల్లి జానకి గృహానికి చేరుకొని ఆమెకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.4 వేలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అందించారు. ఆమెతో మాట్లాడుతూ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సామాజిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. జానికి కుటుంబ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఒంటరి మహిళ పింఛన్వల్ల తనలాంటి లక్షలాదిమందికి ఎంతో మేలు జరుగుతుందని జానకి ఆర్ద్రత నిండిన కళ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ముఖ్యమంత్రి తన ఇంటికి రావడంపట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి కష్టం కలిగినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
దీపం పథకం ప్రారంభోత్సవంలో భాగంగా అంతకు మునుపు ఈదుపురం హెలిప్యాడ్ వద్దకు షెడ్యూల్ ప్రకారమే 12.45 సమయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు `అధికార యంత్రాంగం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసింది. ఈ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్టీవో ఎం కృష్ణమూర్తి, ఎమ్మెల్యే కూన రవికుమార్, గౌతు శిరీష, ఎన్ ఈశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పూల బొకేలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్వద్ద కాసేపు నాయకులు అధికారులతో ముఖ్యమంత్రి ముచ్చటించి.. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు.