- విపరీత ధోరణులను నియంత్రించాలి
- దేశంలో తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్
- జనాభా నిర్వహణపై దృష్టిపెట్టాలి
- ఇద్దరు పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీకి అర్హత
- కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలి
- మోదీ నేతృత్వం.. దేశానికి ఆర్ధిక బలం
- 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం
- కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది..
ఢిల్లీ లీడర్షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి, చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకు గురికావడం తనను బాధించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడా నిరాశకు గురికాలేదు. ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం.. మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి
‘‘సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వ హననం జరుగుతోంది. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు.. సొంత తల్లి, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న వాళ్లని ఏం చేయాలి? ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా? సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి. సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రభాగాన నంబర్ వన్‌గా ఉండాలనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టెలికాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్టు ఇచ్చాను. దాన్ని అమలు చేయడం వల్ల టెలికాం రంగం వృద్ధి చెందింది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు చేరువగా, సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది మా లక్ష్యం. ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధి. ఏఐ, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు సాధించవచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూలనున్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చు.
కనీసం ఇద్దరు పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీకి అర్హత
ఇప్పుడు చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైంది. ఫెర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతోంది. సాధారణంగా ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. ప్రస్తుతం బోర్డర్ లైన్లో జననాల రేటు ఉంది. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మన దేశంలోనూ మొదలవుతుంది. భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం ఒక ప్రణాళికాబద్ధంగా అమల్లోకి తీసుకువస్తే.. 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పని చేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారు. బ్రిటీష్ వాళ్లు భారత్‌కి వచ్చి పరిపాలించిన తరహాలో మనం కూడా ప్రపంచదేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలుతాం. ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి… కనీసం ఇద్దరు పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెబుతున్నా. మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. దానికి అనుగుణంగా పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకటో తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
వాజపేయి పునాదులు వేస్తే.. నరేంద్రమోదీ బలోపేతం చేశారు
తెలుగుదేశం పార్టీ తొలినుంచీ దేశ రాజీయాల్లో కీలక పాత్ర పోషించింది. దేశాభివృద్ది కోసం తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుంది. భాజపాకి వాజపేయి పునాదులు వేస్తే.. నరేంద్రమోదీ బలోపేతం చేశారు. మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతోంది. రానున్న రోజుల్లో ప్రపంచంలో భారతదేశం రెండు మూడు స్థానాల్లో ఉంటుంది. నరేంద్రమోదీ మా నాయకుడు. ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తాం. హరియాణా సీఎం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగింది. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో 2029 ఎన్నికలకు ఏవిధంగా సమాయత్తం అవ్వాలనే విషయంపై మోదీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.
మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది
ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలనపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తితో పాటు.. ఎన్డీఏ కూటమిపై జనానికి భరోసా కలిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేం ముందుగానే ఊహించాం. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 57 శాతం ఓట్లు.. 93 శాతం సీట్లు కూటమికి ప్రజలిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కల్యాణ్ మూడు పార్టీలను కలిపారు. దాని ఫలితం ఇప్పుడు చూశాం. జాతీయస్థాయిలో కూడా భాజపాకి పూర్తి మెజారిటీ వస్తుందని అనుకున్నాం. కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.