- బాధ్యులను కఠినంగా దండిరచండి
- తప్పుడు కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా
- అదనపు కట్నం కోసం మనవరాలిని దారుణంగా చంపేశారు
- భూమిని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్న వైసీపీ నేతలు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో వెల్లువెత్తిన వినతులు
- అర్జీలు స్వీకరించిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల, మాజీ ఎమ్మెల్యే వర్మ
అమరావతి (చైతన్యరథం): టీడీపీ నేతలకు బాధితుల వినతులు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నేతలు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ బాధితుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన మునగాల హారీష్ రెడ్డి వైసీపీ తరఫున సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడని ఫిర్యాదు అందింది. కూటమి ప్రభుత్వంపైనా అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నాడని నంద్యాల జిల్లా తెల్లపురి గ్రామానికి చెందిన గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి ఫిర్యాదు చేశాడు. హారీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
మాదిగ కులానికి చెందిన తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అనుచరులు సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్ట్‌లు పెట్టడమేగాక గాక తన మీద తప్పుడు కేసులు పెట్టారని, తప్పడు కేసు అని తెలిసినా సీఐ అచ్చయ్య తనపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశాడని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన గంటిపోగు స్టీఫెన్‌బాబు వాపోయాడు. వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని కోరాడు. తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని వేడుకున్నాడు. అర్జీని స్వీకరించిన నేతలు విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితుడికి నేతలు హామీ ఇచ్చారు.
పెళ్లయిన ఆరు నెలలకే తన మనవరాలు షేక్ అమీరున్‌ను అదనపు కట్నం కోసం దారుణంగా చంపారని, చంపిన వ్యక్తులు సయ్యద్ రఫీ, సయ్యద్ ఇబ్రహీం, కరీమూన్, సైదాబీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి ఫిర్యాదు చేశారు. పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, తన మనవరాలి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
తాము కొనుగోలు చేసిన స్థలాన్ని పిల్లల పెళ్లిళ్లకోసం అమ్ముకుందామని చూస్తుంటే వైసీపీ నేతలు ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి బోడయ్య, సత్సల లక్ష్మమ్మ.. నేతల ముందు వాపోయారు. భూ కబ్జా దారుల నుండి తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వడియరాజుల సత్రంలో మాజీ ఎమ్మెల్యే అండతో జె రాములు అనే వ్యక్తి సత్రానికి సంబంధించిన వ్యక్తులను కాకుండా ఇతరులును తీసుకువస్తూ రూముల దాతలు, సత్రం సభ్యులను ఇబ్బంది పెడుతూ దౌర్జన్యం చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని సత్రానికి సంబంధించిన పలువురు సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్‌లో వచ్చిన వరదల కారణంగా తన త్రీ వీలర్ బండి వరదల్లో కొట్టుకుపోయిందని.. తాను, తన భార్య ఇద్దరం దివ్యాంగులమని.. తమకు ఎటువంటి జీవనాధారం లేదని.. తమకు జీవనోపాధికి సాయం చేయాలని విజయవాడ జక్కంపూడికి చెందిన పర్సు నవీన్ బాబు నేతలకు విజ్ఞప్తి చేశాడు.
వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదిరించి పార్టీకోసం ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేసి జైలుకు వెళ్లిన తాను మాదిగ కులస్తుడిని కావడంతో.. కులం పేరుతో దూషిస్తూ.. స్థానికంగా ఉన్న నేతలు కొంతమంది వైసీపీ నేతలతో కుమ్మక్కై వారికి అనుకూలంగా పనిచేస్తూ రెడ్లం.. మేము మేము ఒకటే అంటూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని..వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన దాసరి అజయ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. ఇటువంటి వారి కారణంగా పార్టీ నష్టపోవడమే కాకుండా.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. కులం పేరుతో దూషించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కోరాడు.
అనంతపురానికి చెందిన నూర్ మహ్మద్ విజ్ఞప్తి చేస్తూ తన తండ్రి బి. మహబూబ్ బాషా ఎస్పీడీసీఎల్‌లో క్లాస్ 3 కాంట్రాక్టర్‌గా అప్పులు తెచ్చి హిందూపురం డివిజన్ లోని రొద్దం మండలంలో రూ. 12 లక్షల పనులు చేశాడని ఆ డబ్బులు రాకపోవడంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, తన తండ్రికి రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు.