అమరావతి (చైతన్యరథం): క్లిష్ట పరిస్థితుల్లో పెదనాన్న, సీఎం చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి ఎంతో అండగా నిలిచారని సినీ నటుడు నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. నారా రోహిత్ తండ్రి, సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు గత శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వగ్రామం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు అన్నీ తానే అయి ఆదివారం రామూర్తినాయుడి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ తన పెదనాన్న చంద్రబాబు, సన్నిహితుల గురించి ఎక్స్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. తన తండ్రి మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో ఎంతో మద్దతు ఇచ్చారని చెప్పారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయని అన్నారు. అడుగడుగునా అండగా నిలబడ్డ పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు.