అమరావతి (చైతన్యరథం): వైసీపీ భూ రాబందుల పని పడతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉద్ఘాటించారు. అసెంబ్లీలో సోమవారం జగన్ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల వ్యవహారంపై చర్చ సాగింది. జగనన్న ఇళ్ల పేరుతో పేదలకు అప్పట్లో భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం భారీగా భూములు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో భారీ అవినీతి జరిగిందని.. ప్రభుత్వం భూములు కొంటుందని తెలిసిన వైసీపీ నాయకులు ముందుగానే భూములు కొనేసి.. తర్వాత వాటిని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు పలువురు టీడీపీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ..
వైసీపీ నేతలు రాబందులుగా మారి.. పేదల పేరుతో ప్రభుత్వ సొమ్మును దోచేశారని ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములు కూడా తక్కువ ధరలకు కొనేసి ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయించారని తెలిపారు. 9 లక్షల పె ౖచిలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పవని మంత్రి అనగాని హెచ్చరించారు. అదేసమయంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని స్పష్టం చేశారు. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోయినా.. ఒకరిద్దరు టీడీపీ నాయకులే విపక్ష పాత్ర పోషించారు. జగనన్న ఇళ్లలో ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు జరిగాయో వివరించాలని వారు కోరారు. దీంతో మంత్రి.. ఆయా వివరాలను జిల్లాల వారీగా తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్రమాలు ఎక్కువగా జరిగాయని చెప్పారు.