- కేంద్రంతో చర్చించి ప్రాజెక్టులు తేవాలి
- పార్లమెంట్ సెషన్స్ వేదిక చేసుకోండి
- దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాలి
- ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ఎంపీలు తేల్చి చెప్పారు. 2047 విజన్ డాక్యుమెంటుకు కేంద్ర సహకారం అవసరమన్నారు. పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా వాడుకొని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జగన్ ఏపీ బ్రాండును దెబ్బ తీశారని మండిపడ్డారు. ఏపీకి రావాల్సిన పెట్టుబడులు జగన్ చర్యలవల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లాయని పేర్కొన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ తీసుకొస్తామని తెలిపారు.
ఏపీకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలనే దానిపై ఒక డాక్యుమెంట్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. సెకి ఒప్పందంపై అన్ని కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. న్యాయనిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టవచ్చా? అనే కోణాన్ని సీఎం పరిశీలిస్తున్నారని నేతలు వెల్లడిరచారు. ఏపీ ఎంత అప్పుల ఊబిలో ఉంది అనేది గత సమావేశాల్లో పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లామని పలువురు నేతలు స్పష్టంచేశారు. ఏపీకి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరమని.. పోలవరానికి నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని తేల్చి చెప్పారు. కూటమికి ఉన్న 21మంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో సమయానుకూలంగా స్పందిస్తామన్నారు.