- యువనేత రంగంలోకి దిగడంతో సభకు రాకుండా పలాయనం
- లాంఛన ప్రాయమైన ఆర్థిక కమిటీల ఎన్నిక
అమరావతి (చైతన్యరథం): శాసనసభ ఆర్థిక కమిటీల ఎన్నిక సందర్భంగా మంత్రి నారా లోకేష్ చాకచక్యం మరోమారు వైసీపీని చావుదెబ్బ తీసింది. మూడు కీలక కమిటీల చైర్మన్ పదవులకు కూటమి అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయమైంది. ఈ కమిటీల్లో సభ్యత్వానికి తగిన బలం లేదని తెలిసినా వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ముగ్గురిని పోటీకి నిలిపారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. తగినంత బలం లేకపోయినా జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుసుకున్న మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయమే అసెంబ్లీలోని తన ఛాంబర్‌కు చేరుకుని చీఫ్ విప్, విప్‌లతో సమావేశమయ్యారు. 164మంది కూటమి శాసనసభ్యులు ఎవరు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించి, ఓట్లు వేయించే బాధ్యతను విప్‌లకు అప్పగించారు. మంత్రి లోకేష్ చేస్తున్న ఫ్లోర్ మేనేజ్‌మెంట్ తెలుసుకున్న వైసీపీ పోటీదారులు అవాక్కయ్యారు. ఎలాగూ ఓటమి తప్పదని తెలిసిపోవడంతో ఎన్నికలను బహిష్కరించి పలాయనం చిత్తగించారు.
మంత్రి లోకేష్ మాత్రం ఈ ఎన్నికను సీరియస్‌గానే తీసుకుని చివరి సభ్యుడు ఓటువేసే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. దీంతో మూడు ఆర్థిక కమిటీలకు కూటమి అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయమైంది. పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పులవర్తి ఆంజనేయులు (జనసేన, భీమవరం), అంచనాల కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ, మండపేట), పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా కూన రవికుమార్ (టీడీపీ, ఆముదాలవలస) ఎన్నికయ్యారు. ఆర్థిక కమిటీల ఎన్నికల సందర్భంగా మంత్రి లోకేష్ చూపిన చొరవను ప్రత్యక్షంగా చూసిన సీనియర్ శాసనసభ్యులు ఫ్లోర్ మేనేజ్‌మెంట్‌లో మంత్రి లోకేష్ తన తండ్రిని తలపించారని కొనియాడారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను పోటీకి నిలిపిన సమయంలో ఇదేతరహా ఫ్లోర్ మేనేజ్‌మెంట్ ను ఆయన అమలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తండ్రికి తగిన తనయుడని సీనియర్లు చమత్కరిస్తున్నారు.