తిరుపతి (చైతన్య రథం): నారావారిపల్లెలో గురువారం నిర్వహించనున్న రామ్మూర్తినాయుడి కర్మ క్రియలలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నారావారిపల్లెకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు గతవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన కర్మ క్రియలలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం 6.35 గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తితిదే ఈవో, జిల్లా అధికార్లు మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. వీరిలో టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీ ఎస్వో శ్రీధర్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఆరని శ్రీనివాసులు, భానుప్రకాష్, ఎంఎల్ఏ థామస్, ఎంఎల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి నారావారి పల్లెకు రోడ్డు మార్గాన బయలుదేరారు.