- రూ.39 వేల 7 కోట్లు కేటాయింపు
- రాష్ట్ర చరిత్రలోనే ఈ ఏడాది బీసీలకు అత్యధిక నిధులు
- ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
- బీసీ అభ్యర్థుల కోసం 26 జిల్లాల్లో డీఎస్సీ ఉచిత కోచింగ్ కేంద్రాలు
- మీడియా సమావేశంలో మంత్రి సవిత
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా ఎన్డ్డీఏ ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఈ ఏడాది బడ్జెట్లో రూ.39 వేల 7 కోట్ల నిధులను కేటాయించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యుఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే బీసీ సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించిన ప్రభుత్వంగా నిలిచిందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనేందుకు ఇంత పెద్దఎత్తున నిధుల కేటాయింపే ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొన్నారు. అదే విధంగా బీసీ వర్గాలకు ఏడు కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలకు రూ.17 వేల 319 కోట్లను కేటాయించడం కూడా శుభ పరిణామమని మంత్రి అన్నారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాల కింద రూ.1,977.53 కోట్ల సబ్సిడీ రుణాలను అందజేయనున్నట్టు మంత్రి సవిత పేర్కొన్నారు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ (50 శాతం) రూ.1,046.76 కోట్లు, ఎన్బీసీఎఫ్డీసీ టర్మ్ లోన్ల కింద రూ.129.29 కోట్లు, బ్యాంకు రుణంగా రూ.778.42 కోట్లు, లబ్ధిదారు వాటా(10 శాతం)గా రూ.22.96 కోట్లు మొత్తం కలిపి రూ.1,977.53 కోట్లు సబ్సిడీ రుణాలుగా అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. దానివల్ల మొత్తం 1,33,849 మందికి ప్రయోజనం కలగనుందని తెలిపారు.
డీఎస్సీ ఉచిత కోచింగ్ కేంద్రాలు
రాష్ట్రంలోని వివిధ బీసీ వర్గాల అభ్యర్థులకు 26 జిల్లాల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్ కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి సవిత పేర్కొన్నారు. అదే విధంగా త్వరలో సివిల్ సర్వీస్ పరీక్షలకు కూడా ఉచిత కోచింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.
ఈడబ్ల్యుఎస్ వర్గాలకూ..
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యుఎస్) వర్గాల వారి అభ్యున్నతికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఈ వర్గాలకు 7 కార్పొరేషన్లకు రూ.10,273.80 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కాపు, రెడ్డి, కమ్మ, ఈడబ్యుఎస్, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఈ నిధులు కేటాయించారని తెలిపారు.
అంతేగాక కాపు కార్పొరేషన్ మినహా 6 కార్పొరేషన్ల కింద రూ.383.41 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు వివరించారు. దీనివల్ల 59,309 మందికి లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఈ రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ (50 శాతం) రూ.257.80 కోట్లు, బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటా రూ.125.61 కోట్లుగా ఉందని తెలిపారు. స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధంగా మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటు, ఈడబ్ల్యుఎస్ నిరుద్యోగ యువతతో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు, ఈడబ్ల్యుఎస్ మహిళా సాధికారితకు ఫ్యాషన్ డిజైనింగ్/టైలరింగ్‌లో శిక్షణ, మహిళా సాధికారితకు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ, హాస్పిటాలిటీ సెక్టార్‌లో షార్ట్ టెర్మ్ కోచింగ్‌కు ఈ రుణాలు అందజేస్తారని తెలిపారు.
కాపు కార్పొరేషన్ కు రూ.4,647 కోట్లు
ఈ ఐదేళ్ళ కాలంలో కాపుల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా మొదటి ఏడాది రూ.4,646.99 కోట్లు కేటాయించామని మంత్రి సవిత వివరించారు. కాపు యువత, మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.496.79 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు తెలిపారు. రాష్ట ప్రభుత్వం సబ్సిడీ మొత్తం రూ.217.79 కోట్లు, బ్యాంకు రుణం రూ.229.25 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.49.75 కోట్లు కలిపి రూ.496.79 కోట్లని మంత్రి సవిత వివరించారు. స్వయం ఉపాధి పథకాలు, ఎంఎస్‌ఎంఈ గ్రూపులకు, కాపు మహిళల సాధికారతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, చంద్రన్న విద్యోన్నతి పథకానికి, మహిళలకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ శిక్షణకు ఈ రుణాలు మంజూరు చేస్తారని మంత్రి సవిత తెలిపారు.
ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇలు, బీసీ కార్పొరేషన్ ద్వారా యూనిట్లను ఏర్పాటు చేస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి పోలా బాస్కర్, శాఖ సంచాలకులు డా.మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.