- లోకేష్ పాదయాత్ర కళ్లకు కట్టినట్లుగా ఉంది
అమరావతి (చైతన్యరథం): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై రూపొందిన ‘యువగళం యువతకు మనోబలం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, ఆంధ్రనాడు ఎడిటర్ మద్దినేని హరిబాబును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పుస్తకంలో పాదయాత్ర పూర్తిగా కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. ఇటువంటి పుస్తకాలు ప్రజా చైతన్యానికి, వారి పురోభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయన్నారు. పుస్తకంలో పాదయాత్ర సమగ్రంగా ఉందని, ఎటువంటి పొగడ్తలకు తావివ్వకుండా జరిగింది జరిగినట్లు పూర్తి పాదయాత్రను ప్రతిబింబించిందన్నారు.
టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ పుస్తకం చాలా బాగుందని, ఇటువంటి పుస్తకాలు ప్రజా చైతన్యాన్ని తీసుకువస్తాయని, పొగడ్తల్లో మోయకుండా ఉన్నది ఉన్నట్టు అక్షరీకరించడం చాలా అభినందనీయమని పుస్తక రచయితలను అభినందించారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మాట్లాడుతూ పూర్తి పాదయాత్రపై పుస్తకం రావడం సంతోషించదగ్గ పరిణామం అన్నారు. రచయిత హరిబాబును అభినందించారు.
ఈ సందర్భంగా మద్దినేని హరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా యువగళం యువతకు మనోబలం పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
కార్యక్రంమలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ యువగళం మహా పాదయాత్రలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల పడుతున్న ఇబ్బందుల గురించి నారా లోకేష్ ప్రజలకు వివరించిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచించి పుస్తక రూపంలో ప్రజలకు అందించే ప్రయత్నంలో హరిబాబు చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇంటిగంట మునిరత్నం నాయుడు, ఆంధ్రనాడు దినపత్రిక విలేకరులు గురు మోహన్, వెంకటేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.