- దోపిడీలో కార్పెట్ బాంబింగ్ చేసింది జగన్ ముఠానే
- ఉమ్మడి ఏపీ 294 నియోజకవర్గాల యువతకు విజన్ 2020 సైబరాబాద్‌లో ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది.
- విజన్ 2020 విద్యుదుత్పత్తి పెంచి కరెంట్ కోతలు నివారించింది -సాగునీటి విప్లవం తెచ్చింది.
- కిలో మీటర్‌కి ఒక పాఠశాల పెట్టి విద్యా విప్లవం తెచ్చింది.
- విజన్ 2029 అమరావతి, పోలవరం సృష్టించింది.
- 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 5.13 లక్షల ఉద్యోగాలిచ్చింది.
- విజన్ 2047 ప్రతి కుటుంబం తలసరి ఆదాయం 30 లక్షలకు పైగా పెంచుతుంది
- జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలలో ఏపీది దేశంలో రెండవ స్థానం.
- టెక్నాలజీ వల్లనే తెలుగు బిడ్డలు ప్రపంచ ఉద్యోగాల పోటీలో విజేతలయ్యారు.
అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, పండుగ కానుకలులాంటి 120 చంద్రన్న సంక్షేమ పధకాల్ని రద్దు చేసింది జగనే. ఆదివారం సాక్షిలో వర్ధెల్లి మురళీ చంద్రబాబుపై అబద్దాలతో వ్యాసం రాస్తారు. సోమవారం జగన్‌రెడ్డి ఆ అబద్దాలను వల్లెవేస్తూ ప్రకటన చేస్తారు. ‘‘బాబు సర్కార్ కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకుందని’’ మురళి.. జగన్ వారసత్వాన్ని చంద్రబాబుకు అంటగట్టే కుతంత్రం చేశారు. బాంబుల వారసత్వం వైఎస్ కుటుంబానిదేగాని నారా కుటుంబానిది కాదు. ‘‘విజన్ 2020కి కొనసాగింపే స్వర్ణాంధ్ర 2047… ఈ నమునా అసమానతలను కనీవినీ ఎరుగనంత స్థాయిలో పెంచిందని’’ మరో అబద్దాన్ని దొర్లించారు. విజన్ 2020 వల్ల సైబరాబాద్ సృష్టి జరిగి ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల రైతు బిడ్డలు, కూలీల బిడ్డలు 30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి పొందారు. ప్రతి నలుగురు ఎన్‌ఆర్‌ఐలలో ఒకరు తెలుగువారయ్యారు. విజన్ 2020తో విద్యుదుత్పత్తి పెంచి కరెంట్ కోతలు నివారించబడ్డాయి. 1947నుంచి 1996 మధ్య అంటే 49 ఏళ్ళలో విద్యత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం కేవలం 5 వేల మెగావాట్లు. చంద్రబాబు పాలనలో 1996-2024 మధ్య అంటే తొమ్మిదేళ్ళలో మరో 5 వేల మెగావాట్ల అదనపు సామర్థ్యం పెంచారు. దీనివల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యమైంది. విజన్ 2020 ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పెద్దఎత్తున నిర్మించి.. లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది.
హైదరాబాద్ ఆదాయంతోనే నేడు తెలంగాణ ప్రభుత్వాలు తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వగలుగుతున్నాయి. కి.మీ 1కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక ఇంజినీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని చంద్రబాబు స్థాపించడం వల్లనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదల విద్యార్ధులు నేడు సైబరాబాద్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఉద్యోగాలు పొందగలిగారు. తెలంగాణ భూముల విలువ పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో పేదరికాన్ని తగ్గించింది విజన్ 2020 మాత్రమే. చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థను దేశంలో ప్రథమ స్థానంలో నిలిపారు. దీనివల్ల కోటి మందికిపైగా మహిళలు పేదరికం నుంచి బయటపడ్డారు.విజన్ 2020ని ఆనాడు 420 అని హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని ప్రజల్ని రెచ్చగొట్టారు. తొండలు గుడ్లు పెట్టే ప్రాంతంలో హైటెక్ సిటీనా? అంటూ వైఎస్ ముఠా దుష్ప్రచార దాడి చేసింది. చివరకు ఏమయ్యింది? విజన్ 2020 తెలుగు వారికి ఒక ప్రపంచస్థాయి సైబరాబాద్ నగరాన్నిచ్చింది.
వైఎస్ పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు రుణ మాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని ప్రధానికి వైఎస్ లేఖ రాశారు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో రెండవ స్థానం. రైతు రుణ భారంలో మొదటి స్థానం – రైతు భరోసాకు రాష్ట్ర నిధులు ఇచ్చింది కేవలం రూ.7500 మాత్రమే. రెండో వైపు చంద్రబాబు ఇచ్చిన రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పధకాల్ని రద్దు చేసి రైతులకు ద్రోహం చేశారు. చంద్రబాబు పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గించారు. ఈ సమయానికి గత జగన్ పాలనలో 8 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 18 లక్షల టన్నుల ధాన్యం కొని నగదు 48 గంటల్లోనే రైతు ఖాతాలలో వేస్తోంది. జగన్ పాలనలో నగదు చెల్లింపులకు మూడు నెలలకు పైగా పట్టేది. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ ముఠాకు లేదు.
‘‘సామాన్య ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. సబ్సిడీలు ఇవ్వకూడదు’ అనేది చంద్రబాబు విధానం అన్నట్లు వర్ధెల్లి మురళీ మరో అబద్దం రాశారు. చంద్రబాబు సామాన్యుల్ని సొంత కాళ్ళపై నిలబెట్టే పధకాలు ప్రవేశపెట్టారు. ఈ పధకాల్ని జగన్ రద్దు చేశారు. పేదల్ని బిచ్చగాళ్ళు చేసే పధకాల్ని జగన్ పెట్టారు. మూడు లక్షల సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీ డ్రైవర్లకు ఇన్నోవా కారు ఇచ్చి వారిని ఓనర్లు చేశాడు చంద్రన్న. దీన్ని జగన్ రద్దు చేసి డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చారు. మద్యం రేట్లు, డీజిల్- పెట్రోల్ రేట్లు పెంచి డ్రైవర్ నుంచి లక్ష రూపాయలు కొట్టేసి బిచ్చగాళ్లను చేశారు. అమ్మ ఒడి నాన్న బుడ్డితో సరి. పైగా విషపూరిత మద్యం పోసి 30 లక్షల మంది పేదలు అనారోగ్యం పాలై నిరుపేదలయ్యారు. కేంద్రం పంపిన 5.65 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంచకుండా బొక్కేశారు.
సంచార రేషన్ వాహనాలు బియ్యం మాఫియాలకు వేల కోట్లు తెచ్చి పెట్టాయి. రేషన్ వాహనదారులైన పేదలు అప్పుల పాలయ్యారు. ఇలా నవరత్నాలు నవ మోసాలయ్యాయి. డిబిటి ద్వారా పేదలకు ఇచ్చిన దానికన్నా మద్యం ధరలు, విద్యుత్ ఛార్జీలు లాంటివి పెంచి లాక్కోన్నదే రెట్టింపుగా ఉన్నది. పైగా అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, పండుగ కానుకలు, అన్నదాత సుఖీభవ, డ్రిప్ పరికరాలకు 90 శాతం సబ్సిడీ లాంటి 120 చంద్రన్న సంక్షేమ పధకాల్ని జగన్ రద్దు చేశారు. మరీ మోసం ఏమిటంటే, బీసీ, ఏస్సీ, ఏస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్ళించి.. పేదల్ని సొంత కాళ్ళపై నిలబడకుండా చేశారు. 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్ భూముల్ని ప్రీ హోల్డ్ చేస్తే అందులో 4 లక్షలకు పైగా ఎకరాలు వైకాపా గ్రద్దలు తన్నుకుపోయే ప్రయత్నం చేసి పేదలకు ద్రోహం చేశారు.
జీవో 117 ద్వారా పేదల కాలనీల్లోని పాఠశాలలు మూసేశారు. 5 లక్షలకు పైగా పేద బిడ్డల చదువుకు దూరమయ్యారు. ఒక్క డిఎస్సీ కూడ జరపలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్ నిర్వహించబోయే డిఎస్సీలో 16,347 మంది ఉపాద్యాయ నియామకాలు జరుగుతాయి. ఇందులో సగంమంది రిజర్వేషన్ యువత లబ్ది పొందుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడయ్యాడంటే నలుగురూ పేదరికం నుంచి బయట పడతారు. జగన్ ఈ పని చేయకుండా రూ.5 వేలు జీతంతో వాలంటీర్లుగా పేదల్ని మోసం చేశారు. పేదలకు మంచి విద్య అందించే ఎయిడెడ్ విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేశారు. సెంటు పట్టా పేరుతో పేదల పేరు చెప్పి రూ.7వేల కోట్ల కుంభకోణం చేశారు. ఊరికి దూరంగా సెంటు పట్టా కాలనీలు అరకొర పెట్టి మోసం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనలాంటి విద్యార్ధుల పధకాలకు రూ.6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల వ్యాపారాలకు.. పరిశ్రమల స్థాపనకు ఇచ్చే రాయితీలు నీరు గార్చారు. ప్రశ్నించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను 600 మందికి పైగా హత్యలు చేశారు. పేదలు సొంత కాళ్ళపై నిలబెట్టే పధకాల్ని రద్దు చేసిన జగన్.. పెత్తందారేగాని పేదల పక్షం కాదు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు. జగన్ ముఠా మాత్రం వేలు, లక్షల కోట్లకు పడగలెత్తింది.
దోపిడిలో కార్పెట్ బాంబింగ్ చేసింది జగన్ బంధుగణమే.
చంద్రబాబు రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు పెద్ద ఎత్తున స్థాపించారు. ఐదు డిఎస్సీలు పెట్టి లక్షల ఉద్యోగాలిచ్చారు. భూమి కొనుగోలు పధకం పెట్టారు. పారిశ్రామిక, వ్యాపార రాయితీలు ఇచ్చారు. పున్నయ్య కమిషన్ 42 సిఫారసులు అమలు చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు. మంచి టిడ్కో గృహాలు నిర్మించారు. బీసీ, ఏస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచారు. జీఓ నెం.3 పునరుద్దరించి గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారు. ఏజెన్సీలో కాపీ తోటలు పెంచారు. పేదల బాంధవుడు చంద్రన్న –
పేదల ద్రోహి జగన్ అనేది వాస్తవం.
పి4 విధానం ద్వారా స్వర్ణాంధ్ర విజన్ 2047తో రానున్న 22 ఏళ్ళలో తలసరి ఆదాయం 42వేల డాలర్లకు పైగా పెరుగుతుంది. పేదరికంలేని సమాజం ఏర్పడుతుంది. ప్రభుత్వ సుస్థిరతతో ఇది నూటికి నూరు పాళ్ళు సాధ్యం. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగివుంటే ఈ పాటికే ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల కేంద్రాలు మిని సైబరాబాద్‌లు అయ్యేవి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి వున్నా, పోలవరం నదుల అనుసంధానం పూర్తై ఈ సరికే ఏపీ కరువురహిత రాష్ట్రమయ్యేది. ప్రజా రాజధాని అమరావతి పూర్తై 175 నియోజకవర్గాల యువత అమరావతిలో ఉద్యోగాలు, ఉపాధి పొంది వుండేవారు. కనుక రాష్ట్ర ప్రజలు జగన్ ముఠా దుష్ప్రచారాలకు మరోసారి మోసపోకుండా తమ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలి.
`గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జి సెంటర్