- గిరిజన ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: మంత్రి డోలా
- భిన్నత్వమే భారత్ ఏకత్వం అనేలా..: మంత్రి గుమ్మిడి
- అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు: మంత్రి దుర్గేష్
- కేఎల్ వర్శిటీలో 3 రోజులపాటు నిర్వహణ
- దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలనుండి హాజరైన విద్యార్థులు
- వేడుకలలో భాగంగా సంప్రదాయ నాటిక, నృత్య, సంగీత పోటీలు
- 49 విభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడి
- విజేతలకు బహుమతీ ప్రధానం
మంగళగిరి (చైతన్య రథం): గిరిజన విద్యార్థుల కళా నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి దేశవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ సంప్రదాయ మరియు సంస్కృతీ కళా ఉత్సవం ఉద్భవ్-2025 ముగింపు వేడుకలను విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో కృష్ణ జింక ప్రధాన వేదికపై శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమ, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి డోలా మాట్లాడుతూ … ఉద్భవ్-2025కు ఏపీ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు. 22 రాష్ట్రాల నుండి విద్యార్థులు హాజరవడం జాతీయ సమగ్రత, ఐక్యతకు నిదర్శనమన్నారు. దేశంలోని వైవిద్యభరితమైన సంస్కృతి, సంప్రదాయాలు, అభిప్రాయాలు, ఆలోచనలు.. ఒకరికొకరు పరస్పరం పంచుకోవడానికి ఉద్భవ్-2025 ఒక వేదికగా అభివర్ణించారు. అన్ని రంగాల్లో వేగంగా పరిగెడుతున్న భారత్‌లో ఇలాంటి వేడుకలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా పేర్కొన్నారు. భారత్ మాదిరిగానే ఏపీ సైతం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని అంటూ.. ఇందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గిన్నీస్ బుక్‌లో నమోదయ్యే రీతిలో నిర్వహించమని, అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. 35 ఈవెంట్‌లలో 1500 విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అద్భుతమని అంటూ.. గెలుపు, పథకాలతో సంబంధం లేకుండా వేడుకల కరతాళ ధ్వనులను విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి బోధన మరియు సమాన అవకాశాలను కల్పిస్తే వారు చరిత్రను సృష్టించగలరని నిరూపించారన్నారు.
యువ భారతం మీకోసం ఎదురుచూస్తుందని అంటూ.. కార్యక్రమంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని మంత్రి డోలా పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘‘వేరు వేరు ప్రాంతాలు, భాషలు, సంస్కృతులున్నా.. మనందరం భారతీయులమే. మనం ఆదివాసీలమేనన్న భావనతో ఐకమత్యంగా విద్యార్థులు పాల్గొనడం అభినందనీయం. అనేక రంగాల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభ అసాధారణం. ఏపీనుండి వచ్చిన విద్యార్థుల్లో కొందరు 108సార్లు సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచిన విశాఖ యోగా చాంపియన్స్ ప్రశంసనీయం’’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన అరకు కాఫీని పండిస్తున్న గిరిజన రైతుల కృషిని గుర్తించి.. కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేస్తున్న సీపం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కృషి అభినందనీయమన్నారు. గిరిజన కళా సంపద, సంప్రదాయాలు, ప్రతిభను ప్రతిబింబించే నాటికలు, ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ గిరిజన విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గిరిజన శాఖ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా 405 గిరిజన స్కూళ్ల నుండి పాల్గొన్న విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ‘‘దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్రతిభ చూపడం అసాధారణ విషయం. ఇటువంటి జాతీయస్థాయి కార్యక్రమానికి ఏపీ వేదిక కావడం గర్వించే విషయం. సరైన సదుపాయాలులేని చోటు నుంచి సమగ్ర అభివృద్ధి సాధించడం సామాన్య విషయం కాదు. అడవిలో పుట్టిపెరిగిన వారు సైతం అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. ఉద్భవ్-2025ను ఏపీలో విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ దిశానిర్దేశంలో ఇలాంటి గొప్పవేడుక విజయవంతంగా జరుపుకోవడం గర్వించదగ్గ అంశం. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన కళలను ఒకే వేదికపై చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ఏపీ ఎప్పుడూ ముందుంటుంది’’ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్, ఎన్‌ఈఎస్‌టీఎస్ జాయింట్ కమిషనర్ బిపిన్ చంద్ర రాటురి, ఏపీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గౌతమీ తదితరులు ఉద్భవ్ `2025 ప్రాముఖ్యత, ఉత్సవం సాగిన తీరును వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రంపచోడవరం ఐటిడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరన్ రాజ్, కేఎల్ యూనివర్సిటీ వీసీ వెంకట్రామన్, ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, కాకి లక్ష్మి, జిసిసి నెంబర్ కన్నమరాజు, టీడీపీ ఎస్టీ సెల్ చైర్మన్ ఎం ధారునాయక్, అధికార్లు పాల్గొన్నారు.












