పాలకొల్లు (చైతన్యరథం): కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న విలన్ జగన్ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. సినిమాల్లో విలన్ మాదిరిగానే త్వరలో జగన్ కథ ముగుస్తుందన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కోటి యాభై లక్షలతో సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ జగన్కు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హెూదా కూడా లేకుండా తీర్పునిచ్చినా, ఆయనలో మాత్రం ఇంకా మార్పు రాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోదీ, సారధ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుంటే ఓర్వలేని వైసీపీ విషం చిమ్ముతోందన్నారు గోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు, జగన్ పాలనలో విద్వంసానికి గురయ్యాయన్నారు.
నాడు జగన్ మోసాలు చేస్తే, కూటమి ప్రభుత్వం గెలిచిన 18 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిందన్నారు. జగన్ విధ్వంసం చేసిన వ్యవస్థలను నేడు సీఎం చంద్రబాబు గాడిలో పెడుతూ, అభివృద్ధి, సంక్షేమం దిశగా పాలన చేస్తున్నారన్నారు. నాడు ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైన జగన్ పాలన, దౌర్జన్యాలు, కేసులు, లూఠీలు, దోపిడీలు, గంజాయి, కల్తీ లిక్కర్తో సాగిందన్నారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటేనే భయపడేలా జగన్ పాలన చేశాడన్నారు. నేడు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తుంటే, జగన్ మాత్రం రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే విధ్వంసం సృష్టిస్తామంటూ వారిని బెదిరిస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.















