- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు
- స్పీకర్ అయ్యన్న అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాజకీయ వత్తిడిలో నిరంతరం గడిపే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు, మండలి సభ్యులకు ప్రత్యేక క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్లతో కలిసి క్రీడా నిర్వహణ,ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాది తరహాలోనే ఈసారీ అత్యంత వేడుకగా కార్యక్రమాలను నిర్వహించాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఒక రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాలలో గెలిచినవారికి బహుమతి ప్రదానం జరగనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆసక్తినిబట్టి పురుషులకు, మహిళలకు విడివిడిగా వివిధ క్రీడా పోటీలు ఏర్పాటు చేయనున్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్లు అనురాధ, యార్లగడ్డ వెంకటరావు, కూన రవికుమార్, శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. త్వరలోనే క్రీడల పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయనున్నారు.














