- స్టాళ్లలో మహిళల ఉత్సాహానికి మురిసిన చంద్రబాబు
- మహిళల వ్యాపార మెళకువలను ఆసక్తిగా తెలుసుకున్న సీఎం
అమరావతి (చైతన్య రథం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్సులో మహిళలు రూపొందించిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా పరిశీలించారు. చేతితో నేసిన చీరలు, తోలుబొమ్మలు, గుర్రపుడెక్కతో రూపొందించిన బుట్టలు, మిల్లెట్ ఉత్పత్తులతో స్టాళ్లను మురిపెంగా పరిశీలించారు. ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏవిధంగా ఉంటుంది..? ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా..? ప్రభుత్వంనుంచి ఇంకెలాంటి సహకారం కావాలని మహిళలను సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన శిక్షణతో పులివెందులలో మిల్లెట్ టిఫిన్స్, బిస్కట్లువంటి ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్నట్టు ప్రమీల అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గర్వంగా చెప్పుకుంది. అయితే ఉత్పత్తులు వినియోగించిన తరువాత వినియోగదారుల ఆరోగ్యం ఎలా ఉంటుందోననే అంశంపైనా వ్యాపార అధ్యయనం చేసుకోవాలని ప్రమీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఏజెన్సీ మండలాల్లో నేచురల్ ఫార్మింగ్ ద్వారా చెర్రీ టమాట, స్ట్రాబెర్రీవంటి తోటలకు సంబంధించిన స్టాల్‌ను సీఎం పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, శిక్షణ తీసుకుని పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్న మహిళ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. శక్తి టీం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా.. ఆత్మహత్య చేసుకోబోతోన్న తన ప్రాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి టీం సభ్యులు కాపాడారని సీఎంకు శిరీష అనే మహిళ వివరించారు. తనకిప్పుడు మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చిందని సీఎంకు సంతోషంగా చెప్పిన శిరీష, ఆరేళ్ల చిన్నారి నాన్ చాక్ ప్రదర్శనను తిలకించి అభినందించారు. స్టాళ్లను ఏర్పాటు చేసిన మహిళల విజ్ఞప్తితో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.













