- అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి గుమ్మిడి
- ప్రపంచాన్ని నడిపే శక్తి మహిళలే: బీజేపీ అధ్యక్షుడు మాధవ్
అమరావతి (చైతన్య రథం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు షర్మిల, మహిమ, మహిళా మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లను సత్కరించారు. అలాగే డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించే ఉద్దేశంతో రూపొందించిన “స్వయం ఏపీ” బ్రాండ్ పేరు, లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. డ్వాక్రా సంఘాల ఆర్థికాభివృద్ధికి మద్దతుగా రూ.10,102 కోట్ల రుణాలకు సంబంధించిన మెగా చెక్కును మహిళలకు అందజేశారు. అదేవిధంగా సెర్ప్ ఆధ్వర్యంలో 26 ఎంవోయూలు, ఇతర విభాగాలనుంచి 15 ఎంవోయూలను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ… ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు.
డ్వాక్రా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ లక్షల్లో సంపాదిస్తున్నారని ప్రశంసించారు. “సూపర్ సిక్స” పథకాలు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని, అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కుటుంబాల ఆర్థికస్థితి మెరుగుపడేలా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని, మహిళలు ఆర్థికంగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో కనీసం ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. మహిళల అభ్యున్నతికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు.
నేటి ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలేనని, అన్నిరంగాల్లో వారు అద్భుత విజయాలు సాధిస్తున్నారన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, బీసీ సంక్షేమ మంత్రి సబిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సెర్ప్ సీఈవో కరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ అనురాధ, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.













