- సైబరాబాద్‌లో భూములపై పెట్టుబడులు సూచించిన చంద్రబాబు
- సీఎం సలహా పాటించక మంచి అవకాశం కోల్పోయాం…
- అమరావతి విషయంలో ఆ పొరబాటు రిపీట్ చేయను
- చంద్రబాబుతో భేటీలో డీఎలఎఫ్ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ (చైతన్య రథం): 30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహా పాటించక హైదరాబాద్‌లో ఓ కీలక పెట్టుబడి అవకాశాన్ని, గొప్ప ఆదాయాన్ని కోల్పోయామని ప్రముఖ రియల్ ఎస్టేట్, హౌసింగ్ సంస్థ డీఎలఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా చంద్రబాబు సూచించినా… భవిష్యత్‌ను సరిగ్గా అంచనా వేయలేక పెట్టుబడులు పెట్టలేదని రాజీవ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్ వేదికవద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎలఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ కొద్దిసేపు భేటీ అయ్యారు. వారి భేటీలో నాటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు దార్శనికత, సైబరాబాద్ నిర్మాణంతో రాయదుర్గం ప్రాంతం హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదిగిందన్నారు. నాడు భూములపై పెట్టుబడి పెట్టకుండా అవకాశం కోల్పోయానని… ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతిలో ఆ తప్పు పునరావృతం కానివ్వనన్నారు. అమరావతిలో పెట్టుబడులకు రాజీవ్‌సింగ్ ఆసక్తి ప్రదర్శించారు. త్వరలో అమరావతిని సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తానని ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతితోపాటు విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని డీఎలఎఫ్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు.












