- వైసీపీ సర్పంచ్ అడ్డంకులతో నిలిచిన పక్కా ఇంటి నిర్మాణం.. న్యాయం చేయాలని వినతి
- రీ-సర్వేలో రికార్డుల తారుమారు… ఆక్రమణదారుల దౌర్జన్యం
- అర్జీలు స్వీకరించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు
- సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన ప్రవీణ్‌కుమార్ అర్జీ ఇదీ… ‘మా గ్రామ పంచాయతీలో జరిగిన భారీ అవినీతిపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకుండా వైసీపీ నేతలకు మద్దతు పలుకుతున్నారు. పంచాయతీ నిధుల్లో సుమారు రూ.1.21 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై సర్పంచ్, కార్యదర్శిలకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ అప్పటి నుంచీ అధికారులు విచారణలో ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. సర్పంచ్ భర్త వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావడంతో అధికారులు ఆయనకు వత్తాసు పలుకుతున్నారు. గతంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలు 43 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారు. సర్పంచ్ పదవీకాలం ముగిసేవరకు విచారణను సాగదీసి కేసును నీరుగార్చాలని డీపీవో, డీఎల్పీవో స్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కావున పదవీకాలం ముగియకముందే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అభ్యర్ధించాడు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన పద్మావతి గ్రీవెన్స్‌లో ఇచ్చిన అర్జీలో విషయాలు.. ‘మా గ్రామంలోని సర్వే నెం.827/7లో మా కుటుంబ పెద్దలు కొపనాతి వెంకటరత్నం, సీతారామస్వామి, నర్సింహస్వామి గతంలో తుఫాను బిల్డింగ్ కట్టుకోవడానికి 15 సెంట్ల భూమిని అప్పటి కలెక్టర్ సమక్షంలో ఉచితంగా ఇచ్చారు. మిగిలిన 0.20 సెంట్ల స్థలంలో మా కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. అందులో ఉన్న నాలుగు కొబ్బరి చెట్ల ఫలసాయాన్ని ఇప్పటికీ మేమే అనుభవిస్తున్నాము. మా సొంత స్థలమైన 20 సెంట్లను కూడా అధికారులు పొరపాటున తుఫాను బిల్డింగ్‌తో కలిపి సర్వే నెం. 22/ఎ నిషేధిత జాబితాలో పెట్టారు. ఇదే అదునుగా చూసుకుని వైసీపీకి చెందిన సర్పంచ్ తిరుమాని శ్రీను, పంచాయతీ సెక్రటరీ కలిసి మా ప్రమేయం లేకుండా మా సంతకాలు లేకుండా ఆ స్థలం పంచాయతీకి చెందినదని అక్రమంగా తీర్మానం చేశారు. పాత పాకను తీసివేసి పక్కా ఇల్లు నిర్మించుకోవాలని ప్రయత్నిస్తే, సర్పంచ్ అడ్డుపడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు’. కావున తమరు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన శ్రీనివాసరావు ఏమన్నాడంటే… ‘మా గ్రామం రెవెన్యూ పరిధిలోని ఖాతా నెం.186, సర్వే నెం.117లో ఉన్న 0.47 సెంట్ల భూమికి అన్ని చట్టబద్ధమైన ఆధారాలు 1`బి, పాస్ పుస్తకం, ఈసీ ఉన్నప్పటికీ రీ-సర్వేలో కావాలనే మంతిని సింహచలమమ్మ పేరును తప్పుగా నమోదు చేశారు. గత నాలుగేళ్లుగా పెంచుకుంటున్న ఆయిల్‌పామ్ మొక్కలను దుండగులు నరికివేసి ఆర్థికంగా దెబ్బతీశారు. ఇదే కాకుండా సర్వే నెం.19-1లో కూడా చెట్లను నరికివేసి అక్రమంగా పిల్లర్లు వేసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఈ విషయమై తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తే పోలీసులకు చెప్పమంటున్నారు. పోలీసుల వద్దకు వెళ్లే తహసీల్దారు ఆదేశించాలి తప్ప తామేమీ చేయలేమని చెప్తూ ఎఫఐఆర్ కూడా నమోదు చేయట్లేదు. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి మా పేరును, ఖాతా నెంబరును వారి పత్రాల్లోకి ఎలా చేర్చారని అడిగితే రెవెన్యూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు.’ తమరు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాడు.
వైఎస్సార్ కడప జిల్లా ఇందిరాపురానికి చెందిన సుందరమ్మ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ…. ‘మా గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం అప్పటి తహసీల్దారు నాకు 3 సెంట్ల స్థలాన్ని మంజూరు చేశారు. అయితే దాన్ని చంద్రకళ, కేశవులు అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై గతంలో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా ఆయన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. సదరు 3 సెంట్ల స్థలంలో కొంత భాగం ఇల్లు, మరికొంత ఖాళీ స్థలం ఉన్నట్టు తేలింది. అయితే నా భర్త ఏసురత్నంకు అసలు సంబంధమే లేని ‘నారాయణమ్మ’ అనే మహిళ పేరును అడ్డంపెట్టుకుని నా ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. నన్ను ఇంటి నుంచి బయటకు గెంటివేసి ఆస్తిని అక్రమంగా లాక్కున్నారు.’ అమాత్యులు సమస్య పరిష్కారానికి కషి చేయాలని కోరింది.
ఎన్టీఆర్ జిల్లా కొండూరుకు చెందిన సత్యరాజు గ్రీవెన్స్‌లో ఇలా విన్నవించాడు… ‘మా గ్రామంలో సర్వే నెం.493-1దీలో ఉన్న సుమారు 2.50 సెంట్ల ప్రభుత్వ భూమి గతంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం మా తాత భీమాల కోటయ్య పేరు మీద ఉండేది. అయితే నా తండ్రి/చిన్నాన్న అయిన భీమాల భూషణం వద్ద నుంచి బోద్దు ప్రకాశరావు అనే వ్యక్తి ఆ భూమిని కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకున్న ప్రకాశరావు, రెవెన్యూ రికార్డులలో అధికారులను మోసం చేసి నా తాత కోటయ్య పేరును తొలగించి తన పేరు నమోదు చేయించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో సదరు భూమిని ప్రకాశరావు కుమారుడు, కుమార్తె పేర్ల మీదకు మార్పిడి చేయించారు. కేవలం కౌలుకు తీసుకుని నమ్మించి భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నాడు.’ ఈ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
తిరుపతి జిల్లా శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎస్.మురుగ నాయక్ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ‘మా గ్రామంలోని సర్వే నెం.387లో 2008లో వేసిన ‘వెంకటరాజానగర’ లే` అవుట్‌లో ప్లాట్ నెం.74ను (53 అంకణాలు) 2014లో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పటికీ ఈ భూమిపై ఈసీ 10/1 రికార్డులు నా పేరిటే ఉన్నాయి. 2019లో అప్పటి కలెక్టర్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో అధికారులు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. 50:50 పద్ధతిలో భూమిని తీసుకునేందుకు బాధితుల నుంచి అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో సీరియల్ నెం.86లో నా పేరు స్పష్టంగా నమోదై ఉంది. పాత జీవో (173) ప్రకారం పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అసలైన హక్కుదారులను కాదని వారి స్థానంలో అర్హత లేని వ్యక్తులకు ప్లాట్లు కేటాయిస్తున్నారు.
తక్షణం చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరాడు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరానికి చెందిన నూకరాజు ఇచ్చిన అర్జీలోని అంశాలు… ‘దశాబ్దాల క్రితం సాధువుగా భిక్షాటన చేస్తూ గెడ్డపాలెం గ్రామానికి వచ్చిన కావూరు సుబ్బరాజు ఇక్కడే స్థిరపడ్డాడు. తిమ్మాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.207లోని వివిధ సబ్ డివిజన్లలో (పాత సర్వే నెం.207-1, 207-3, 207-5) మొత్తం 3.4450 ఎకరాల భూమి ఆయన పేరున ఉంది. స్థానిక శివాలయం అభివృద్ధి కోసమే ఆయన గతంలో ఈ భూములను సాగులోకి తీసుకున్నాడÁT. రెవెన్యూ రికార్డుల్లోనూ ఆయన పేరే నమోదై ఉంది. గెడ్డపాలెం సాధువుగా పిలవబడే సుబ్బరాజు అవివాహితుడు. ఆయనకు కుటుంబ సభ్యులు, వారసులు ఎవరూ లేరు. గత ఏడాది ఆయన మృతి చెందడంతో ఆ భూములు ఇప్పుడు వారసులు లేని ఆస్తులుగా మిగిలిపోయాయి. వాటిని ప్రభుత్వం తక్షణం ఆధీనంలోకి తీసుకోని సుబ్బరాజు ఆశయం మేరకు 3.44 ఎకరాల భూమిని స్థానిక శివాలయానికే కేటాయించి దేవాలయ అభివృద్ధికి ధార్మిక కార్యక్రమాలకు సహకరించాలి’ అని కోరారు. వీటితో పాటు పలువురు పింఛను, రేషన్, ఇళ్ల నిర్మాణ సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్‌లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాం ఆర్థిక తోడ్పాటు కల్పించాలని ఇంకొందరు అభ్యర్థించారు.














