ఉక్కు ఉత్పాదన పెంపును లక్ష్యంగా పెట్టుకున్నాం
విశాఖ ఉక్కును గాడిలో పెట్టేందుకు సహకరించాం
ప్లాంట్ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ కల్పన
ఏఎంఎనఎస్ శంకుస్థాపనలో ఉక్కు మంత్రి కుమారస్వామి
చంద్రబాబు పారిశ్రామిక విజన్‌కు బలమైన అడుగు: లక్ష్మీమిట్టల్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’కు నిదర్శనం: ఆదిత్య మిట్టల్
ఉత్తరాంధ్రకు ఏఎంఎనఎస్ ఒక వరం: పవన్ కల్యాణ్
అనకాపల్లి (చైతన్య రథం): ఏపీలో చంద్రబాబు- పవన్‌కల్యాణ్ నాయకత్వం అద్వితీయంగా రాణిస్తోంది. రాష్ట్రాన్ని ప్రగతిశీల, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా సీఎం చంద్రబాబు మార్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ రాణిస్తున్నారు. ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏపీకి రావటం ఈ ప్రాంతానికి స్టీల్ ఎకోసిస్టమ్‌ను సాకారం చేసిందని కేంద్ర ఉక్కు మంత్రి హెడ్‌డీ కుమారస్వామి అన్నారు. ఏఎంఎనఎస్ ప్లాంటు శంకుస్థాపన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. “ప్రధాని మోదీ రూపకల్పన చేసిన 2047 వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ ఉత్పాదన పెరగాలి. జాతీయ ఉక్కు వినియోగ విధానాన్ని అనుసరించి కూడా దేశవ్యాప్తంగా ఉక్కు ఉత్పాదన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖ ఉక్కును గాడిలో పెట్టేందుకు ఉత్పాదన కూడా పెరిగేందుకు కేంద్రం ఆర్ధిక సహకారాన్ని అందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ కుదుటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని ఇచ్చింది. ఆర్సెలార్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉక్కు ఉత్పాదనకు, ఎంఎసఎంఈలకు, ఉద్యోగ కల్పనకు ఓ చోదక శక్తిగా మారుతుందని విశ్వసిస్తున్నా. వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మితమై ఉత్పాదన ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
విశాఖ ప్లాంట్.. ఏఎంఎనఎస్‌కు కలికితురాయి: లక్ష్మీమిట్టల్
ఏపీలో భారీస్థాయి స్టీల్ పరిశ్రమకు అంకురార్పణ చేయడం ఆనందంగా ఉందని ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది తర్వాత 20 వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న ఆర్సెలార్ మిట్టల్ సంస్థకు ఈ ప్లాంట్ ఓ కలికితురాయిగా అభివర్ణించారు. “నేను జన్మించిన భారతదేశంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ రూపకల్పన చేసిన ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కార్యక్రమంలో ఇది ఆరంభం మాత్రమే. మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పరిశ్రమలు, రక్షణరంగ ఉత్పత్తులు ఇలా వేర్వేరు రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులు తయారవుతాయి. ఏడాదికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో దేశ అవసరాలకు అనుగుణంగా ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజన్‌కు అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి ఈ ప్లాంట్ తోడ్పడుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం నింపేలా ఏపీలోని విధానాలున్నాయని అంటూ.. ఏపీ ప్రగతి సాధించేందుకు తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని ప్రశంసించారు. ఈ పరిశ్రమ లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగాలను కల్పించడమే కాదు, నైపుణ్యం అందిస్తుందన్నారు. అనకాపల్లి ప్రాంతానికి ఉపాధి కేంద్రంగా గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని అంటూ.. తొలి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసి ఇప్పటికి 50 ఏళ్లు పూర్తైందని, అనకాపల్లిలో ఏర్పాటు చేసే ప్లాంట్ అత్యాధునిక స్టీల్ ప్లాంట్‌గా నిలిచిపోతుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్బర్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పరిశ్రమలో స్టీల్ ఉత్పత్తి చేస్తామని, ఉక్కు పరిశ్రమ సాకారానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రగతికి ఈ భారీ పరిశ్రమ కీలకంగా మారనుందని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీమిట్టల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏపీ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’కు ఇది నిదర్శనం: ఆదిత్య మిట్టల్
సభలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ సంస్థ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ “ప్లాంట్ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం స్పష్టంగా కనిపించింది. స్పష్టమైన విధానాలుంటే ఎంత వేగంగా పనులు సాకారమవుతాయో ఏపీ నిరూపించింది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులకు ఏపీపైవున్న నమ్మకానికి పరిశ్రమ అతిపెద్ద ఉదాహరణ. ఈ పరిశ్రమ ద్వారా లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి, రైతులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. విశాఖలోని ప్లాంట్‌నుంచి ముడి ఇనుము ఖనిజ సరఫరా పైప్ లైన్ అనకాపల్లి వరకూ విస్తరిస్తాం. ఇక్కడ తయారైన ఉక్కు ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తాం. దేశీయ అవసరాలకు సరఫరా చేస్తాం. జాతీయ ఉక్కు విధానంలో భాగంగా జాతీయ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ప్లాంట్ కీలకమవుతుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల కల్పనకు 2 ఎంఓయూలను కూడా కుదుర్చుకున్నాం. మెటలర్జికల్ రంగంలో కోర్సుల కోసం ఓ ప్రత్యేక ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. నక్కపల్లిలో ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలో ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలుంటాయని హామీ ఇస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రకు ఏఎంఎనఎస్ ఒక వరం: పవన్ కల్యాణ్
దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఉత్తరాంధ్రకు ఒక వరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పర్యావరణహితమైన అత్యాధునిక స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నందుకు లక్ష్మీనివాస్ మిట్టల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అత్యంత తక్కువ ఉద్గారాలతో నిర్మిస్తుండటంపట్ల పర్యావరణ మంత్రిగా హర్షం వ్యక్తం చేశారు. “ఏపీని విశ్వసించి భారీ పెట్టుబడి పెడుతున్నందుకు ప్రత్యేకించి పారిశ్రామికవేత్త లక్ష్మీనివాస్ మిట్టల్‌కు ధన్యవాదాలు. ఏపీకి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబులాంటి దార్శనికత, విలువలున్న రాజకీయ నాయకుడు ఉండాలి. గతంలో రాష్ట్రంనుంచి పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయి. కానీ ఇప్పుడు అవి వెతుక్కుంటూ వస్తున్నాయి. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తుండటం హర్షణీయం. కేవలం విజనరీనేత చంద్రబాబు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. రాష్ట్రాన్ని సమర్ధంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తొలిదశలో 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యంతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. అత్యంత తక్కువ కాలుష్యం ఉండేలా ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తూ ఆర్సెలార్ నిప్పన్ స్టిల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. 2014-19 మధ్య రాయలసీమకు కియా పరిశ్రమ రాగానే అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఈ ప్రాంత దశా దిశా మారడం ఖాయం. గత పాలకులు రాష్ట్రంలోని పెట్టుబడులను, పారిశ్రామిక వేత్తలను తరిమేశారు. కేవలం 18 నెలల్లో సాకారమైన ఈ పరిశ్రమ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనం. గడచిన 21 నెలల్లో పారిశ్రామిక అనుకూల విధానాలు వచ్చాయి. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. అందుకే గూగుల్ డేటా సెంటర్‌లాంటి ఐటీ పరిశ్రమలు వచ్చాయి. ఇది కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం. ఈ ఉక్కు పరిశ్రమ చాలామంది పెట్టుబడిదారులకు స్పూర్తిగా నిలుస్తుంది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

















