- ఘన స్వాగతం.. ఆత్మీయ ఆతిథ్యం
- శ్రీవారి చిత్రాన్ని బహూకరించిన కుటుంబం
- సంప్రదాయ వంటలతో తేనీటి విందు
- లోకేష్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ
- నమో మార్గదర్శకత్వంలో లోకేష్ అడుగులు
- గతంలోనూ యువనేత పనితీరుపై ప్రశంసలు
- ఢిల్లీలో నాడు ఇంటికి పిలిచి మరీ గౌరవం
హైదరాబాద్(చైతన్యరథం): హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గంటకు పైగా సమయాన్ని చంద్రబాబు కుటుంబానికి కేటాయించారు. బిజీ షెడ్యూల్లో కూడా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు కుటుంబానికి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నమో – నారా బంధా నికి ఇదొక చక్కని ఉదాహరణ అనే భావన రాజకీయ వర్గాల్లో ఏర్పడుతోంది. టీడీపీ-బీజేపీలతో రాజకీయంగా మిత్ర బంధం ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీతో నారా ఫ్యామీలీకి కుటుం బపరంగా కూడా అనుబంధం ఏర్పడింది. అందుకే ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామ్లీతో గంటకు పైగా గడిపారు. నరేంద్ర మోదీ-చంద్రబాబు మధ్య రాజకీయంగా సాన్నిహిత్యం ఉన్నా… నారా లోకేష్ కారణం గా ఆ బంధం కుటుంబం బంధంగా మారిందనే చెప్పాలి. గతంలో నారా లోకేష్ ను కుటుంబంతో సహా ఢిల్లీలోని తన ఇంటికి ప్రధాని మోదీ ఆహ్వానించి గౌరవించారు. అప్పటినుంచి వీరి మధ్య బంధం మరింత బలోపేతం అయింది.. కుటుంబ బంధంగా మారింది.
ప్రధాని నుంచి అరుదైన ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ సభా వేదికపై ‘నీకెన్ని సార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా?’ అని ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైనే లోకేష్‌ను ఆహ్వానించారు. ఈ అరుదైన ఆహ్వానానికి ఉబ్బితబ్బిబ్బు అయిన మంత్రి నారా లోకేష్.. ‘త్వరలోనే కుటుంబసమేతంగా ఢిల్లీకి వస్తాను’ అని ప్రధానితో చెప్పారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఢిల్లీలో మోదీ నివాసానికి భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి వెళ్లిన మంత్రి నారా లోకేష్‌కు దాదాపు 2 గంటల పాటు ప్రధాని తన విలువైన సమ యాన్ని కేటాయించారు. కుటుంబ యోగక్షేమాలు, చదువు సహా అన్నీ వివరాలు తెలుసుకుని దేవాన్ష్‌ను తన ఒడిలో కూర్చోపెట్టు కుని మరీ మాట్లాడారు. తాను చేసిన పాదయాత్ర విశేషాలతో కూడిన ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ప్రధాని చేతులమీదుగా ఆవిష్కరింప చేసి తొలి కాపీని మోదీకి నారా లోకేష్ కుటుంబం అందజేసింది.
మెచ్చిన యువ మంత్రి
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రికీ దక్కని అరుదైన అవకాశం మంత్రి నారా లోకేష్‌కు దక్కుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో తరచూ భేటీ అయ్యే అవకా శం, వివిధ సందర్భాల్లో వేదిక పంచుకునే ఛాన్స్ దక్కిన ఏకైక మంత్రి నారా లోకేషే. ఎన్డీఏ అలయెన్స్ పార్టీగా కాకుండా తన కుటుంబసభ్యుడిలా ఆదరించే ప్రధాని మోదీ ఆత్మీయతకు లోకేష్ ఆయన అభిమానిగా మారారు. ఒక దేశ ప్రధాని.. ఒక రాష్ట్ర మంత్రి మధ్య మూడు దశాబ్దాలకు వయసు తేడా ఉన్నా.. ప్రధాని ఎప్పుడు ఎదురుపడినా, కలిసినా లోకేష్‌తో ఆప్యాయంగా మాట్లాడ తారు. గతంలో ఒక సభలో బరువు తగ్గావ్.. త్వరలోనే మీ నాన్న లా తయారవుతావ్ అంటూ ప్రధాని వ్యాఖ్యానించడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి, అనుబంధానికి నిదర్శనం.
వినయం-విధేయత-నాయకత్వ లక్షణాలు
పెద్దలను గౌరవించే సంప్రదాయం-అతిథులకు మర్యాదలు చేయడం, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో లోకేష్ కనబరిచే పరిణితి ప్రధాని నరేంద్ర మోదీని ఆకట్టుకుంది. 2024 ఎన్నికల్లో కూటమిగా ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేసినప్పుడు ప్రధాని ఏపీలో పాల్గొన్న సభలు విజయవంతం కావడం, వీటి వెనుక లోకేష్ ప్రణాళిక ఉందని తెలుసుకున్న ప్రధాని అప్పుడే అభినందించారు. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక విశాఖ పట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను నెలరోజుల పాటు లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించి విజయవంతం చేయడాన్ని ప్రధాని కొనియాడారు. అలాగే ఇదే విషయాన్ని కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనూ చెప్పారు. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద జరిగిన సూపర్ జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని నిర్ణయాలతో ప్రజలకు ఎలా మేలు కలిగిందో వివరిస్తూ లోకేష్ ఆకట్టుకున్నారు.
ఒక రాష్ట్ర మంత్రి… ప్రధానితో భేటీల రికార్డు
డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్.. ఇదే మంత్రి నారా లోకేష్ పదేపదే చెప్పే మాట. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడడం, పోలవరం పనుల వేగవంతం, అమరావతికి చట్టబద్దత, రైల్వేజోన్ సాధన, గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ ఇవన్నీ కేంద్రం ఆశీస్సులతో సాకారమైనవే. “నమో అంటే విజయం. ఆయన ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని… భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ వెంట అడుగులు వేయడం ధైర్యాన్ని ఇస్తుంది.” అంటారు నారా లోకేష్. ఏపీకి అతిపెద్ద పెట్టుబడులు క్లియర్ చేయడంలోనూ, ప్రాజెక్టుల శంకుస్థాపన లోనూ ప్రధాని మోదీ సహకారం-ఆశీస్సులు మెండుగా ఉన్న లోకేష్.. ఏ రాష్ట్ర మంత్రి కలవనన్ని సార్లు మోదీని కలిశారు. ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతి గురించి పదేపదే మోదీని కలిసి, ఆయన మనసు గెలిచి ఏపీకి ప్రాజెక్టులు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేష్. ఇదీ నమో-నారా బంధం ప్రగతి మంత్రం. డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్ తంత్రం.
అరుదైన అతిథికి అరుదైన బహుమానం
తమ ఇంటికొచ్చిన విశిష్ట అతిథి-తాను అభిమానించే నాయ కుడు ప్రధాని మోదీకి తెలుగు సంప్రదాయ వంటకాలతో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటగిరి చేనేత కళాకా రులచే శ్రీవారిని కీర్తించే శ్లోకంతో కూడిన ప్రత్యేకంగా జామ్దానీ నేతతో తయారు చేసిన శ్రీవారి చిత్రపటాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు కుటుంబం అందించింది. ఆంధ్రప్రద్రేశ్ ఆధ్యాత్మిక, సంప్రదాయ, చేనేత కళా వైభవానికి గుర్తుగా ప్రధానికి ఆ చిత్రపటాన్ని అందజేశారు.














