ఢిల్లీ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతోపాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. విభజన అంశాలతోపాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల్ని మంజూరు చేయాలని ఆయన కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులతోపాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాలలోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
తొలిదశలో 41.15 మీటర్లమేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే తాను స్వయంగా 5 మార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 2నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తైందని, గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు సీఎం తెలియచేశారు. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు లేఖలో వెల్లడించారు. కాలువల సామర్ధ్యం పెంచిన మేరకు నిధులను రీయింబర్స్ చేయాలని జల శక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
హర్ ఖేత్ కో పానీ పథకం కింద నీటి పంపిణీకి నిధులు
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ మరో లేఖను ముఖ్యమంత్రి అందించారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడికతీత, గట్ల బలోపేతంలాంటి పనులు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుండి 524.256 మీటర్‌లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఎలాంటి సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-3 కింద భూసేకరణ ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్ణాటకను ఆదేశించాలని, సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని వివరించారు.
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని.. గోదావరినుంచి సముద్రంలోకి వృధాగాపోయే 200 టీఎంసీ వరద జలాలను మళ్లించేలా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వెల్లడించారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ నీటి అవసరాలకు అనుగుణంగా 8 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిదిగా కేంద్ర జలశక్తి శాఖకు సీఎం చంద్రబాబు లేఖ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.











