- నా వంతు సాయం చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నా
- ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలి
- ఆర్డీటీ సేవలు రాష్టమంతా విస్తరించాలి
- బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రి సందర్శించి మీడియాతో లోకేష్
- అండగా ఉన్నందుకు లోకేష్‌కు మాంచో ఫెర్రర్ కృతజ్ఞతలు
బత్తలపల్లి (చైతన్య రథం): ఆర్డీటీ సంస్థకు నా వంతు సహాయం చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నా. ఆర్డీటీ మనందరి సంస్థ. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి ప్రజలందరూ మద్దతుగా నిలవాలి. ఆర్డీటీ సేవలు ఆంధ్ర రాష్టం మొత్తం విస్తరించాలని, తాము అండగా నిలబడతామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) ఆసుపత్రి సందర్శన అనంతరం అక్కడ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘నా పాదయాత్రకు ముందు ఆర్డీటీ గురించి విన్నాను. కానీ పాదయాత్రలో ఆర్డీటీ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు కళ్లారా చూశా. ఇంట్లో వికలాంగులుగా పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు.. బాధ, ఆవేదనతో వారిని వదిలేస్తారు. అలాంటి పిల్లలను సొంత బిడ్డలకంటే అద్భుతంగా చూసుకునే ఒక ఆర్డీటీ పాఠశాలకు వెళ్లా. అక్కడున్న ఉపాధ్యాయులు వారిని ప్రేమతో చూస్తున్నారు. అనంతపురంలో యువగళం పాదయాత్ర సమయంలో మొదటిసారి మాంచో ఫెర్రర్‌ను కలిశాను. ఆర్డీటీ ఒక సంస్థ మాత్రమే కాదు.. అదో మూవ్‌మెంట్. ఆర్డీటీని ఇక్కడ స్థాపించి 57 ఏళ్లు పూర్తయ్యాయి. ఓవైపు పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడలు, నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణంవంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఆ కుటుంబ చేస్తోంది. నన్నే కదిలించారు. పాదయాత్ర ఇతర జిల్లాలకు వెళ్లినా నా స్పీచ్‌లో అనేకసార్లు ఆర్డీటీ సంస్థ గురించి మాట్లాడటం జరిగింది” అని మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు.
ఆర్డీటీకి అండగా నిలబడతాం
“నేను బలంగా నమ్మేది సమాజానికి అద్భుతమైన సేవ చేస్తున్న ఏ వ్యక్తికైనా సమాజం, ప్రభుత్వం అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఆర్డీటీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రత్యేకంగా మాంచోతో నేను పర్సనల్‌గా ఫాలోఅప్ చేసుకుని కొన్ని అపోహలుంటే వాటిని తొలగించి, వారికి రావాల్సిన లైసెన్స్ ఎన్డీయే ప్రభుత్వం అందించడం జరిగింది. ఆర్డీటీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తోంది కాబట్టే మేం పట్టుదలతో చేశాం. వెనుకబడిన జిల్లాను దత్తత తీసుకుని, ఇక్కడ ప్రజలను ప్రేమతో సొంత కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థకు అండగా నిలబడ్డాం. మున్ముందు కూడా నిలబడతాం. ఈ రోజు మాంచో మాతృమూర్తిని కూడా కలవడం జరిగింది. మొదటిసారి మాంచోను కలిసినప్పుడు ఆయన మాట్లాడే తెలుగును చూసి నేనే ఆశ్చర్యపోయా. తాను పుట్టిపెరిగింది ఇక్కడేనని చెప్పారు. 13 ఏళ్ల వయసు వచ్చే వరకు తనకు ఇంగ్లీష్ తెలియదని చెప్పారు.
ఆర్డీటీకి సహాయం చేయగలగడం నా అదృష్టం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే నేను పాదయాత్ర చేశా. ఇలాంటి అద్భుతమైన సంస్థలను నేరుగా కలవాలి. వారు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేం తెలుసుకోవాలి. జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఆర్డీటీ సంస్థకు నా వంతు 0.001 శాతం సహాయం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, తెలుగువాడిగా, ఆంధ్రుడిగా ఆర్డీటీ అనేది మనందరి సంస్థ. ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకు ప్రజలందరూ, సమాజం మొత్తం మద్దతుగా నిలవాలని నేను పిలుపునిస్తున్నా. నేనిప్పుడే పీడియాట్రిక్ వార్డుకు వెళ్లా. ఒక తండ్రి వారి పాపను చూపించారు. పాప ఈ ఆసుపత్రిలోనే జన్మించిందని, హార్ట్ ప్రాబ్లమ్ ఉందంటే వేరే ఆసుపత్రిలో రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారని, ఆర్డీటీ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేశారని వివరించారు. అదీ ఆర్డీటీ చేసిన సేవ అని ఆయన చెప్పారు. అది విన్న తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మేం మరింత సేవ చేయాలి. నావంతు నేను సహాయం చేయాలనే ఆలోచనతో మీ ముందు నిలబడ్డా” అని స్పష్టం చేశారు.
ఆర్డీటీ సేవలు ఆంధ్ర మొత్తం విస్తరించాలి
“మాంచోకి ధన్యవాదాలు. కష్టకాలంలో కూడా ఓర్పు, సహనంతో ప్రజలకు ఎప్పుడూ సేవ అందిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కూడా ఇది నా బాధ్యత అన్నారు. అనంతపురం, ఆంధ్ర ప్రజలే కాదు.. తెలుగుజాతి మొత్తం ఆర్డీటీకి అండగా నిలబడాలి. కేవలం రాయలసీమలోనే కాదు.. మీ సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం.. ఇంకా సేవలు అందించండి.. మీకు మేం అండగా నిలబడతాం అని మాంచోని కోరుతున్నా. భారతదేశం మొత్తం ఆర్డీటీకి అండగా నిలబడుతుంది” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఆర్డీటీకి అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు: మాంచో ఫెర్రర్
ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ మాట్లాడుతూ.. “మొట్టమొదట లోకేష్‌కు నా అభినందనలు. మొదటిసారి ఆర్డీటీ ఆసుపత్రికి వచ్చారు. లోకేష్‌ని చూసి ఇక్కడున్న పేషంట్స్, సిబ్బంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏడాదిపాటు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు లోకేష్ చాలా సహకరించారు. మొదట కలిసినప్పటి నుంచి ఆర్డీటీకి ఎంతో సహకరించారు. లోకేష్‌కి, మీ అందరికీ నా కృతజ్ఞతలు” అన్నారు.















