* పారిశ్రామిక, సాగునీటి రంగాలకు ప్రోత్సాహం
* పాత పెన్షన్ పునరుద్ధరణ, రిటైర్మెంట్ వయసు పెంపు
* ‘బీచ్ షాక్స్’ పాలసీకి గ్రీన్ సిగ్నల్
* పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటల పాటు సాగిన భేటీలో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగుల సంక్షేమం, పర్యాటక రంగాలే లక్ష్యంగా పలు చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు.
ఉద్యోగులకు భారీ ఊరట: సీపీఎస్ అమల్లోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, వివిధ కారణాల వల్ల సీపీఎస్ అమలు తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు.
ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు: ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న వారి ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు.
పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం: ‘బీచ్ షాక్స్’ పాలసీ
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి ఏపీలో ‘బీచ్ షాక్స్ పాలసీ’ని తీసుకువచ్చారు. తొలి దశలో విశాఖపట్నం, భీమిలి, శ్రీకాకుళం, చీరాల బీచ్ల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. ఈ బీచ్ షాక్స్లను కేవలం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతిస్తారు. ఇందులో పరిమిత రకాల మద్యం విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.
అవయవ మార్పిడిలో పారదర్శకత: కేంద్ర చట్టానికి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ‘ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూ మన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం-2011’ (కేంద్ర చట్టం) అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు, అవయవ మార్పిడి ప్రక్రియలో అవినీతిని అరికట్టి పారదర్శకతను పెంచడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్వాంటం వ్యాలీకి రాయితీలు: అమరావతిక్వాంటం వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్పై 100% స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు ఆమోదం తెలిపారు.
ప్రాజెక్టులకు నిధులు: జీవనాడి పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
పారిశ్రామిక, మత్స్య, ఇంధన రంగాల నిర్ణయాలు
‘ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025’ ముసాయిదాకు ఆమోదం లభించింది. మద్దువలస, యేలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటు బాధ్యతలను ‘ఫిషిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఏవియేషన్ పాలసీ-2026: విమానయాన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చేలా సరికొత్త ఏవియేషన్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సోలార్ పవర్ ప్లాంట్: చిత్తూరు జిల్లాలోని వ్యవసాయ శాఖ భూమిలో పీఎం-కుసుమ్ పథకం కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రాజధాని అమరావతి, పోలవరం మౌలిక వసతులు వీలుగా NREDCAP సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు అనుమతించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు హామీ: హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు వీలుగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.
ఇతర ముఖ్య నిర్ణయాలు: గ్రామీణ ప్రాంతాల్లో VB-GRAMG: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం’వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్’ (VB-GRAMG)ను వచ్చే జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: అగ్రిగోల్డ్ తదితరడిపాజిటర్ల కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా 21 కొత్త పోస్టుల మంజూరుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ: భూసేకరణ, వివాదాల పరిష్కారానికి సంబంధించిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.













