- పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం
- మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం
- స్టీల్ ప్లాంట్ ప్రాసెస్‌లో ఎక్కడా లోపం లేదు
- ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలు
- విశాఖ ఉక్కుకు స్లర్రీ పైప్ లైన్ తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిది
- విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ
విశాఖపట్నం (చైతన్యరథం): స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడ తామని, పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోబో మని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘా టించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రూ.15వేల కోట్ల ప్యాకేజీతో విశాఖ ఉక్కును కాపాడుకుని, తిరిగి ఉత్పత్తి కూడా ప్రారంభించామని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్, నగర పోలీసు కమిషనర్, రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వచ్చారు. అదేరోజు రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా వచ్చి పరిస్థితులను సమీక్షించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా వచ్చారు. స్టీల్ ప్లాంట్ పట్ల, కార్మికులు, సిబ్బంది పట్ల ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ముందుగా రూ.25 లక్షల పరిహారం
నేను కేవలం చెక్ ఇవ్వడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసింది. పర్మినెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి పెద్దమనసుతో హామీఇచ్చారు. గతంలో ఈవిధంగా ఎక్కడా జరగలేదు. అవసరమైతే దీనిని కేంద్ర కేబినెట్ ముందుకు కూడా తీసుకెళ్తానని, తనదీ బాధ్యత అని కేంద్రమంత్రి కచ్చితంగా చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది. స్టీల్ ప్లాంట్ నిబంధనల ప్రకారం కొంతమందికి ఎక్కువ ఎక్స్ గ్రేషియా అందుతుంది.
ఎంతుంటే అంత ఇవ్వాలి. ఇప్పటికే సీఎండీ చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రమంత్రి కుమారస్వామి ఇచ్చిన ఆదేశాల మేరకు 8మంది మృతుల కుటుంబాలకు మొదటి విడత కింద వెంటనే రూ.25 లక్షలు పరిహారం అందజేస్తాం. దాని తర్వాత రావాల్సిన ఎక్స్ గ్రేషియా, పీఎఫ్ నగదు, స్టీల్ ప్లాంట్ నుంచి రావా ల్సింది కూడా మొత్తం లెక్కించి, ఆయా కుటుంబాల ఖాతాల్లో జమచేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసు కుంటుంది. మృతుల అంత్యక్రియల అనంతరం అంద రం మరోసారి చర్చించి ఏం చేయాలో ఆలోచిస్తాం. బాధిత కుటుంబాల పిల్లలు సొంత కాళ్లపై నిలబడేలా చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
కమిటీ నివేదిక తర్వాత చర్యలు
గతంలో విశాఖ ఉక్కును ఎన్డీఏ ప్రభుత్వం ఏవిధంగా కలిసికట్టుగా కాపాడిందో అదేవిధంగా కార్మికుల కుటుంబాలకు మేం అండగా నిలబడతాం. ప్రమాదంపై ఇప్పటికే కమిటీని నియమించారు. ఉక్కు ద్రవం పొంగడం కాకుండా పైనుంచి చిమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. కమిటీ నివేదిక తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు క్షతగాత్రుల్లో ఒకరైన శ్రీనివాసరావును కలిశాను. ఆ పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కును కాపాడాలని ఆయన కోరుకోవటం చూసి తాను ఎంతగానో చలించిపోయానని మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రాసెస్‌లో ఎక్కడా లోపం లేదు
స్టీల్ ప్లాంట్‌లో తక్కువ మంది కార్మికులు ఉండ టం ఈ ప్రమాదానికి కారణం కాదు. ప్రాసెసింగ్‌లో ఎలాంటి పొరపాటు, తేడాలు లేవు. లాడిల్ భారీ శబ్దం తో ఒక్కసారి పేలిపోయి, ఉక్కుద్రవం బయటకు చిమ్మింది. ఇది ఎందుకు జరిగిందో తెలియదు. స్టీల్ ప్లాంట్‌లో అత్యుత్తమమైన రష్యన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. కమిటీ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
స్లర్రీ పైప్ లైన్ తీసుకువస్తాం
విశాఖ ఉక్కుకు కూడా స్లర్రీ పైప్ లైన్ వేయాలి. దీనిపై ఏనాడూ, ఏ కార్మిక సంఘం నాయకులు మాట్లాడలేదు. విశాఖ ఉక్కుకు స్లర్రీ పైప్ లైన్ తీసుకువచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నాం. కార్మికులను చూసుకునే బాధ్యత నాది. పరిహారం అందించి చేతులు దులుపుకుని పోవాలని కార్మిక నేతలు
మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. ప్రభుత్వం తెచ్చిన పునరుద్ధరణ ప్యాకేజీ వల్లే ప్లాంట్ నడుస్తోందని, ఆ ప్యా కేజీ తేకుండా ఉంటే ప్లాంట్ మూతపడి ఉండేదని, ఈ ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోయేవారు కాదు కదా అంటూ కొందరు మాట్లాడటం అత్యంత దురదృష్టకరం. ప్లాంట్ నిలబడాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంటే, జరిగిన దుర్ఘటనను పట్టుకుని ఇలా విమర్శించడం ఎంతవరకు సమంజసం? ప్రజలు
కూడా ఆలోచించాలి. ఎక్స్ గ్రేషియా ఇస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వారు అడిగిన ఎక్స్ గ్రేషియా కంటే రెగ్యులర్ ఉద్యోగులకు ఇంకా ఎక్కువ వస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు.
మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం
పర్మినెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తాం. ఇదీ ఎన్డీయే చిత్తశుద్ధికి నిదర్శనం. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులకు కూడా మేం వచ్చిన తర్వాత న్యాయం చేశామని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
అంతకుముందు విశాఖ కేజీహెచ్క వచ్చిన మంత్రి నారా లోకేష్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మర ణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యుల ను మంత్రి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలిం చారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకు న్నారు. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి లోకేష్ తోపాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత,మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ బాధితులను పరామర్శించారు.
















