విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ స్టీల్స్టాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబసభ్యులను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. స్టీల్ ప్లాంట్లో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ మంగళవారం విశాఖ వచ్చారు. తొలుత కేజీహెచ్కు చేరుకుని స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి
కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు చింతకాయల విజయ్ ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు గురించి మంత్రి లోకేష్ అడిగి తెలుసు కున్నారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఓదార్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడేందుకే తాను వచ్చానన్నారు. బాధితులను పరామర్శించి, తోడుగా ఉంటామని చెప్పేందుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు వచ్చారన్నారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామన్నారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
















