- ఏఐ ఆధారిత జీఎస్టీపై కౌన్సిల్ ప్రశంసలు
- దేశవ్యాప్త అమలు నమూనాగా అభివర్ణన
- సీఎం చంద్రబాబును కలిసిన అధికారులు
అమరావతి(చైతన్యరథం): ఢిల్లీలోని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియ ట్కు చెందిన అదనపు కార్యదర్శి పంకజ్కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రా రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు, శాఖకు చెందిన సీనియర్ అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాఖ అమలుచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, ఏఐ ఆధారిత న్యాయ కేసుల నిర్వహణ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా పరిశీలించారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత డ్యాష్ బోర్డులు, జీఎస్టీ డేటాను ఉపయోగించి రియల్టైమ్లో ఆర్థిక విశ్లేషణ (జీఎస్డీపీ) వంటి కార్యక్రమాలను తెలుసుకున్నారు. విజయవాడ-1 డివిజన్ ను కూడా ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ ఏఐ ఆధారిత దర్యాప్తు, న్యాయ కేసుల నిర్వహణను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం జీఎస్టీ సువిధ కేంద్రాన్ని సందర్శించి పన్ను చెల్లింపుదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించింది.
పర్యటన ముగింపు సందర్భంగా సీఎంను కలిసిన వారు ఏఐ ఆధారిత వినూత్న కార్యక్రమాల ద్వారా పన్నుల పరిపాలనను మరింత బలోపేతం చేయడంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని బలోపేతం చేయడంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఏపీసీటీడీ చేస్తున్న మార్గదర్శక ప్రయత్నాలను ప్రశంసించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సాధించిన స్థాయిలో ఏఐ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు మరెక్కడా కనిపించడం లేదని వారు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన విధానం కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించదగిన విలువైన నమూనాగా నిలు స్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన వల్ల వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కావడంతోపాటు ప్రక్రియలు వేగవంతమై రాష్ట్రంతోపాటు దేశ ఆదాయాలు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏఐ ఆధారిత పన్నుల పరిపాలనను మరింత విస్తృతస్థాయికి తీసుకెళ్లేందుకు జీఎస్టీఎన్ నుంచి అవసరమైన డేటా, వ్యవస్థల అనుసంధానంపై రాష్ట్ర అవసరాలను వివరించారు. రాష్ట్రంతో డేటా పంచుకునే విధానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. రాష్ట్రాన్ని సందర్శించి తమ విలువైన సూచనలు, అభిప్రాయాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. టెలికాం విప్లవం, ఐటీ విప్లవం, రహదారుల అభివృద్ధి నుంచి ప్రస్తుతం ఏఐ ఆధారిత పాలన వరకు సాంకేతికత ఆధారిత పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహకారాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రం నిర్దేశించుకున్న వ్యాపార నిర్వహణ వేగం, వ్యాపార సౌలభ్యం లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన వ్యవస్థలు పూర్తి సామర్థ్యంతో పని చేసేలా కేంద్ర ప్రభుత్వం, జీఎస్టిఎన్ కూడా అదే సహకార స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. అనంతరం వారిని సత్కరించి రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా జ్ఞాపికలను అందజేశారు.













