- టీడీపీ కేంద్ర కార్యాలయంలో వివిధ కార్యక్రమాలకు హాజరు
- శిక్షణా తరగతుల ట్రైనర్స్‌తో పార్టీ అధినేత భేటీ
- ట్రైనర్స్‌కు ప్రశంసా పత్రాలు అందచేత..
- యూనిట్ ఇంఛార్జ్‌లతో కాఫీ కబుర్లు సమావేశంలో మాటా మంతీ
మంగళగిరి (చైతన్య రథం): స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలిపార్టీ నాయకుడికి ఇష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు చిట్‌చాట్‌గా మాట్లాడారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైకాపా అధినేత జగన్ యత్నిస్తున్నట్టు విమర్శించారు. ఎన్నికలు వాయిదా పడితే.. ఆ పార్టీకి లాభం అనుకోవడం దింపుడుకళ్లెం ఆశలేనని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందన్నారు. ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది తెదేపానేని పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం సీట్లు అనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 34 శాతంకంటే ఎక్కువ సీట్లే బీసీలకు ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ శిక్షణ కార్యక్రమాలపై మాట్లాడుతూ.. “టీడీపీ శ్రేణులకు శిక్షణ ఇవ్వడమనేది చాలా మంచి కార్యక్రమం. పార్టీ విలువలు, సిద్ధాంతాలను కొత్త నాయకత్వానికి అందించాలి. కేడర్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా పార్టీ సిద్దాంతాలు నేటి తరానికి తెలుస్తున్నాయి… క్షేత్రస్థాయికి వెళ్తున్నాయి. క్షేత్రస్థాయి అనుభవం ఉన్న వారు… పార్టీ భావజాలం తెలిసిన వారితో శిక్షణ ఇప్పిస్తున్నాం. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. ఎప్పటికప్పుడు ప్రజలతో.. వివిధ వర్గాల వారితో ఇంటరాక్ట్ అవ్వాలి.
సొంతగా పేపర్, ఛానల్ పెట్టుకున్న పార్టీ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేవు. మీడియాను అడ్డంపెట్టుకుని గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలే తిప్పికొట్టాలి. వాస్తవాలను ప్రజలకు వివరించే విషయంలో నేతలు, కేడర్ చొరవ చూపాలి. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదిరించి సొంత కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి వల్ల అధికారులు… పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడి వల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలైన సంఘటనల్లేవు. నేరాలు చేయిస్తారు. వారితో మరిన్ని నేరాలు చేయించి క్రిమినల్స్‌గా మారుస్తారు. వాళ్లు చేయించిన నేరాలు మెడకు చుట్టుకుంటాయనుకున్నప్పుడు అంతం చేస్తారు. ఇది గొడ్డలి పార్టీ విధానం. ఇలాంటి వారి వ్యక్తిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలి” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకెళ్తున్నామంటే అందుకు తమ కేడరే కారణమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ దుందుభి మోగించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్, ప్రతి యూనిట్, ప్రతి క్లస్టర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలని, టీడీపీ, జనసేన, బీజేపీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రస్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు ఐక్యంగా ఉండాలి. కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధించగలదని అన్నారు. ప్రజలతో మంచిగా ఉంటే డబ్బుతో సంబంధం లేకుండా గెలుస్తారు. ప్రజలతో సఖ్యత లేని వారు ఎంత ఖర్చు చేసినా గెలవలేరు. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం, సీపీఎస్, జాబ్ కేలండర్…ఇలా అన్నింటిలోనూ మోసం చేసింది. 2019-24 మధ్య కాలంలో విద్యుత్ ఛార్జీలను 9సార్లు పెంచారు. కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఒక్క టీడీపీనే అంటూ.. పదవులు తీసుకుని పని చేయని వారి స్థానంలో వేరే వారిని నియమిస్తామని హెచ్చరించారు. యువత ఆలోచనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.













