- రాష్ట్ర చరిత్ర, కళా వారసత్వం ఉట్టిపడేలా నిర్మాణం
- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపకల్పన
- సందర్శకుల కోసం పీపుల్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్
- నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్తో కీలక చర్చలు
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతిలో ప్రతి ష్టాత్మకంగా నిర్మించనున్న శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తుశిల్పం, తెలుగు సంస్కృతి సమ్మేళ నంగా, రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జా తీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో బుధ వారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక మంత్రి పొంగూరు నారాయణ, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ అండ్ ఆర్కిటెక్ట్ పెడ్రో హెబెర్ ్బస్క్ సంస్థ ప్రతినిధులతో పాటు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ ఏ.వి.రావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సుస్థిర నిర్మాణ విధానాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై చర్చించారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా శాసన సభ భవనం కేవలం పరిపాలనా నిర్మాణంగా కాకుండా రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన చేసేలా విస్తృతంగా చర్చించారు.
సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక
ఆధునిక వాస్తుశిల్ప సౌందర్యంతో పాటు భవనం వినియోగించే ప్రతి వర్గానికి సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు. శాసనసభ సముదాయంలో ముఖ్యమంత్రి ఛాంబర్, స్పీకర్ ఛాంబర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ కార్యాలయం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ మందిరం, మంత్రులు, శాసనసభ్యుల కార్యాలయాలు, వివిధ శాసనసభ కమిటీల సమావేశ మందిరాలు తదితర విభాగాలను సమగ్రంగా ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. అదేవిధంగా ప్రధాన సభా మందిరం, కమిటీ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్స్, శాసనసభ్యుల లాబీలు, ప్రోటోకాల్ ప్రాంతాలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, మీడియా వర్క్ స్టేషన్లు, మీడియా బ్రీఫింగ్ సదుపాయాలు, సందర్శకుల గ్యాలరీలు, పబ్లిక్ లాంజ్లు, విజిట ర్స్ రిసెప్షన్ ప్రాంతాలు వంటి కీలక సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంపై ప్రతినిధులతో అభిప్రాయాలు పంచుకున్నారు. శాసనసభ కార్యకలాపాలను ఆధునిక పద్ధతుల్లో నిర్వహించేందుకు ఆడియో-విజువల్ వ్యవస్థ లు, డిజిటల్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, ఆధునిక కమ్యూని కేషన్ నెట్వర్క్, లైవ్ టెలికాస్ట్, బ్రాడ్కాస్టింగ్ సదుపాయాలు, డిజిటల్ శాసన వ్యవస్థలు వంటి సాంకేతిక మౌలికవసతులను సమగ్రంగా ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.
ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఫైర్ సెఫ్టీ వ్యవస్థలు
ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, మీడియా ప్రతిని ధులు, సందర్శకుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ప్రోటోకాల్ మూవ్మెంట్, యాక్సెస్ కంట్రోల్, భద్రతా జోన్లు, పార్కింగ్, డ్రాప్-ఆఫ్, పికప్ ప్రాంతాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ వ్యవస్థలు వంటి అంశాలను డిజైన్ లో సమర్థవంతంగా సమన్వయం చేయా లని చర్చించారు. అన్ని వర్గాల ప్రజలకు సులభమైన వినియోగాన్ని కల్పించేలా యూనివర్శల్ యాక్సెసబిలిటీ ప్రమాణాలు, ర్యాంపులు, లిఫ్టులు, ఆధునిక శానిటేషన్ సదుపాయాలు, సులభమైన అంతర్గత రాకపోకల మార్గాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో సహజ కాంతి గాలి ప్రసరణ, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిర్వహణ, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు వంటి సుస్థిరత అంశాలను కూడా డిజైన్లో అంతర్భాగం చేయాలని చర్చించారు. భద్రతకు సంబంధించి సీసీటీవీ నిఘా, యాక్సెస్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ తదితర ఆధునిక వ్యవస్థలను సమగ్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో వివరించారు.
అద్భుతమైన రాజధాని సీఎం చంద్రబాబు లక్ష్యం
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అద్భుతమైన రాజధాని నిర్మాణం సీఎం చంద్రబాబు లక్ష్యం. అసెంబ్లీపైన టవర్ నుంచి రాజధాని మొత్తం వీక్షించేలా అసెంబ్లీ భవనం నిర్మించనున్నాం. డీలిమిటేషన్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లపై చర్చ జరిగింది. 265 అసెంబ్లీ సీట్లు, 110 శాసనమండలి సీట్లకు అనుగుణంగా డిజైనింగ్ చేశారు. ప్రజలు అసెంబ్లీని సందర్శించినప్పుడు మంచి అనుభవం కలిగేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గవర్నర్ ప్రసంగించే సమయంలో ఉభయ సభల సభ్యులు కూర్చునేలా సెంట్రల్ హాల్ ఏర్పాటు చేసుకునేలా డిజైన్ చేస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణం అండర్ గ్రౌండ్ పార్కింగ్తో ఒక గార్డెన్లో ఉండాలని సీఎం సూచించారు. మంత్రులు, విప్లు, కమిటీ చైర్మన్లు, సభ్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా డిజైన్ రూపొందిస్తున్నామని తెలిపారు.














