- నగర ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- రంగరాయుడు చెరువులో అమృత్ 2.0 తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ఒంగోలు, రంగరాయుడు చెరువు (చైతన్య రథం): ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గంలోని రంగరాయుడు చెరువులో అమృత్ 2.0 త్రాగునీటి ప్రాజెక్టును విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఒంగోలు నగర ప్రజలకు 24 గంటలూ నిరంతరంగా తాగునీటి సరఫరా అందించే దిశగా రూ.424.42 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఒంగోలు నగరంలోని మొత్తం 35 డిస్ట్రిబ్యూషన్ జోన్లను రీ-జోనింగ్ చేసి, 605.30 కిలోమీటర్ల పొడవున తాగునీటి పంపిణీ నెట్‌వర్క్ అభివృద్ధి చేశారు. దీనిద్వారా 51,340 హౌస్ సర్వీస్ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఇంటికీ మెరుగైన తాగునీటి సరఫరా అందనుంది. నగరంలో నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించి, ప్రజలకు నిర్ణీత సమయాల్లో మాత్రమే కాకుండా 24 గంటలూ తాగునీరు అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. పెరుగుతున్న ఒంగోలు నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన, స్థిరమైన నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, విజయ్‌కుమార్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.














