- 8,904 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు
- సూపర్ సిక్స్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
- సంజీవని దేశానికే మోడల్.. త్వరలో రాష్ట్రవ్యాప్త అమలు
- 2028 నాటికి కార్బన్ న్యూట్రల్ కుప్పం: సీఎం చంద్రబాబు
కుప్పం (చైతన్యరథం): పేదరికాన్ని కేవలం సంక్షేమ పథకాలతో రూపుమాపడమే కాదు, పేద కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో గుర్తించిన 8,904 బంగారు కుటుంబాలను 2026 డిసెంబరులోగా ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. పేద కుటుంబాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి మార్గదర్శులు పనిచేయాలని, ఆయా కుటుంబాల సామర్థ్యాలకు అనుగుణంగా చేయూత అందించాలని సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తదితర సూపర్ సిక్స్ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, కుటుంబాలకు కలుగుతున్న ఆర్థిక వెసులుబాటు, సాధికారతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎల్పీజీ కనెక్షన్లు, సోలార్ రూఫ్తాప్లు, సీసీ రోడ్లు, రహదారులు, నీటి సరఫరా, డ్రెయినేజీ తదితర మౌలిక వసతులపై కూడా స్థానికులతో మాట్లాడారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో ముచ్చటించిన సీఎం.. సంజీవని సేవలు పొందుతున్న వారిని స్వయంగా అడిగి పథకం అమలు తీరును తెలుసుకున్నారు.
పేదల జీవితాల్లో వెలుగుల కోసమే సూపర్ సిక్స్
ప్రతి పేద కుటుంబానికీ అండగా నిలవాలన్న లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ‘ఇంటికో వ్యాపారవేత్త’గా మహిళలను తీర్చిదిద్దేందుకు అవసరమైన చేయూత అందిస్తామని తెలిపారు. యువత నైపుణ్యాలు సాధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
రైతు ఆదాయమే లక్ష్యం
అనంతరం కుప్పం రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. వ్యవసాయం, ఉద్యాన, సెరీకల్చర్, పశుసంవర్ధక రంగాల్లో సుస్థిర అభివృద్ధి విధానాలపై చర్చించారు. భూసారం, భూమిలో తేమ శాతాన్ని పెంచేందుకు బయోచార్ వంటి విధానాలను అనుసరించాలని సూచించారు. వ్యవసాయ వ్యర్ధాలను భూసారాన్ని పెంచేందుకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల దాణాకు కొరత లేకుండా వీబీజీ రామ్ పథకం ద్వారా చర్యలు చేపడతామని తెలిపారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యత, సాగుపై ముందస్తు ప్రణాళిక అవసరమని సీఎం పేర్కొన్నారు. సాగు వ్యయాన్ని తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. కుప్పంలో ఫ్లోరికల్చర్ ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న రైతులు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు.
‘సంజీవని’ ఇక రాష్ట్రవ్యాప్తం
కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సంజీవని ఆరోగ్య కార్యక్రమం దేశానికే మోడల్గా మారుతోందని చంద్రబాబు అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని చెప్పారు. కుప్పం పైలట్ తర్వాత సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
2028 నాటికి ‘నెట్రో కుప్పం’
కుప్పాన్ని 2028 నాటికి కార్బన్ న్యూట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. ఇంధనం, నీరు, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యర్థాలను సంపదగా మార్చి నెట్రో కుప్పం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రతి ఇంటిపైనా సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
వ్యర్ధాలను కాంపోస్టుగా మార్చి వ్యవసాయానికి వినియోగించేలా చూడాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చేందుకు చెక్ డ్యామ్లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. కుప్పంలో 75-80 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్, స్ట్రీట్లెటింగ్ చేపట్టాలని సూచించారు. జగ్జీవన్ మిషన్ పనుల్లో భాగంగా కొత్త రోడ్లు వేసే ముందే పైడ్లైన్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
టూరిజం హబ్ గా కుప్పం
కుప్పాన్ని మంచి టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాక్ క్లైంబింగ్, బైకింగ్ వంటి సాహస క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ కుప్పాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘స్వచ్ఛమైన కుప్పం.. ఆరోగ్యవంతమైన కుప్పం”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.














