- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
- ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి
- అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో గండి ప్రభావంపై ఆరా తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మనమిత్ర యాప్ ద్వారా బాధితులు తమ సమస్యలను వెంటనే సీఎంవో సిబ్బందికి తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు..అధికారుల వివరణ
ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన బుట్టాయగుడెం, వేలేరుపాడు, పోలవరం మండలం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల ఏరియల్ వ్యూ అనంతరం సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్‌టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) నుంచి అధికారులతో సమీక్షించారు. సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు హాజరు కాగా పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
ముంపు ప్రాంతాలను త్వరితగతిన క్లియర్ చేయాలి
తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వివిధ వాగులు, కాలువలకు వరద ప్రవాహాలు పెరిగాయని తెలిపారు. ఎర్ర కాలువ, గోనెల వాగు తదితర ప్రాంతాలకు నీటి ప్రవాహాలు వస్తున్నాయని అధికారులు వివరించారు. తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా ఈ కాలువలకు వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కారంచేడు నుంచి కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ముంపు ప్రాంతాలను త్వరితగతిన క్లియర్ చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలను అప్రమత్తం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాగులు, వంకలకు వస్తున్న వరద ప్రవాహాలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఏపీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి 25,375 క్యూసెక్కుల వరద నీరు చేరిందన్నారు. నల్లమడ డ్రెయిన్‌కు 47వేల క్యూసెక్కులు, ఎర్ర కాలువకు 19,756 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరిందని వెల్లడించారు. తమ్మిలేరు, గోనెల వాగుకు 5,500 క్యూసెక్కులు, పెద్ద వాగుకు 9,500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు చేరాయని వివరించారు. పొంగిపొర్లుతున్న వాగుల కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


















