అమరావతి( చైతన్యరథం) : 2019 నుంచి 2024 మధ్య వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అడుగడుగునా దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలే చూశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. ఆనాడు ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ప్రశ్నించిన వ్యక్తులపై, సంస్థలపై భౌతిక దాడులకు తెగబడ్డారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఎంతోమందిని అక్రమంగా జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో టీడీపీ నేత బోండా ఉమా, న్యాయవాది కిషోర్ కార్లపై నాటి వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు దాడులు చేసిన దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందే ఉన్నాయి. అభ్యర్థులను కిడ్నాప్‌లు చేయడం, పోలీస్ స్టేషన్లకు పిలిపించి రివార్లతో బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం వైకాపా నిత్యకృత్యంగా మార్చుకుంది. ఆ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు వైకాపాను చిత్తుగా ఓడించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదు. నేడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన చోట పుంగనూరు, తిరుపతి, రాయచోటి వంటి ప్రాంతాల్లో మళ్లీ రక్తపాతం సృష్టించాలని చూస్తున్నారు. అధికారం కోల్పోయి, రాష్ట్రంలో ఉనికి గల్లంతవుతోందనే భయంతోనే వైకాపా మళ్లీ హింసాకాండకు తెగబడుతోందని విమర్శించారు.
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి దౌర్జన్యం
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉంటే, వైకాపా అధినేత, నాయకులు కుట్రపూరితంగా అల్లర్లు సృష్టిస్తున్నారు. పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికలతో ఓ లోక్‌సభ ఎంపీకి ఏం పని అని ప్రశ్నిస్తున్నాం. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 11 గంటలకు మొదలవుతుంటే, ఉదయం 10:30 గంటలకే మిథున్ రెడ్డి 8 కార్ల కాన్వాయ్‌తో నామినేషన్ కేంద్రం వద్దకు రావడం దేనికి సంకేతం? కర్ణాటక నుంచి రౌడీలను, గుండాలను తీసుకొచ్చి, నామినేషన్లు వేసేందుకు వస్తున్న తెలుగుదేశం నాయకుల వాహనాలను ఢీకొడుతూ దౌర్జన్యాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రౌడీయిజంతో ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ధూళిపాళ్ళ నరేంద్ర హెచ్చరించారు.
భయపెట్టి నామినేషన్లు అడ్డుకోవాలనే వైకాపా కుట్రలు.. తొలిరోజే రౌడీలతో దౌర్జన్యాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు నామినేషన్లు వేయకుండా భయపెట్టడమే లక్ష్యంగా వైకాపా మొదటి రోజే దౌర్జన్యాలకు తెరలేపిందని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు సహకరించడం లేదనే సాకు చూపిస్తూ, కర్ణాటక నుంచి రౌడీలను రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో మొదలై ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ఒకవేళ చివరి రోజై ఉండి, అధికారులు నామినేషన్లు తీసుకోవట్లేదని నిరసన తెలిపారంటే అందులో ఏదో అర్థం ఉంది. కానీ తొలిరోజే, అధికారులు నామినేషన్ కేంద్రం తలుపులు కూడా తెరవకముందే ఉదయం 10:30 గంటలకే దౌర్జన్యానికి దిగడం వెనుక స్పష్టమైన కుట్ర ఉంది. మొదటి రోజే భయానక వాతావరణం సృష్టిస్తే ఆ ప్రాంతంలో ఎవరూ నామినేషన్ వేయడానికి ముందుకు రారనే దురాలోచనతోనే వైకాపా నేతలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. కర్ణాటక నుంచి రౌడీలను తీసుకొచ్చి, 8 కార్ల కాన్వాయ్‌తో అక్కడున్న ప్రజలను, వాహనాలను తొక్కిస్తూ సాగించిన దౌర్జన్యం తీవ్రమైన అరాచకం.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగించిన ఈ వికృత చేష్టలను ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది తీవ్రంగా ఖండించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. అధికారులు ఏవైనా ఇబ్బందులు పెడితే అప్పుడు ఎంపీ జోక్యం చేసుకోవడంలో న్యాయం ఉంది. కానీ నామినేషన్లు మొదలయ్యే 11 గంటల సమయానికంటే ముందే ఒక ఎంపీ కాన్వాయ్‌తో వచ్చి విధ్వంసం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్నాళ్లూ బెదిరింపులు, కిడ్నాపులు, దౌర్జన్యాలతో అధికారాన్ని అనుభవించిన వీరికి, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా జరిగితే తమ మనుగడ, పుట్టగతులు ఉండవనే భయంతోనే ఈ అరాచకాలకు ఒడిగట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేలా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పుంగనూరు సహా ఇతర ప్రాంతాల్లో హింసకు పాల్పడిన ఎంతటి పెద్దవారినైనా వదలకుండా, కారకులైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
కూటమి సంక్షేమం చూసి ఓటమి భయంతోనే వైకాపా రక్తపాతం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే భయంతోనే వైకాపా నాయకులు రాష్ట్రవ్యాప్తంగా హింసాకాండకు తెరతీశారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఏకమై ఒక విప్లవంలా ఓటేసి వైఎస్సార్సీపీని 11 సీట్లకే పరిమితం చేసి రాజకీయ సమాధి కట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా ఆ పార్టీ తీరు మారలేదు. “చింత చచ్చినా పులుపు చావదు” అన్న చందంగా.. గతంలో ఫ్యాక్షనిజం, బెదిరింపులు, దోపిడీలతో స్థానిక ఎన్నికల్లో గెలిచాం, ఆ దౌర్జన్యాలకు పేటెంట్ మాదే అన్నట్లుగా వైకాపా నేతలు నేడు మళ్లీ అదే దారిలో ప్రవర్తిస్తున్నారు. ఒక్క ఓటు మీ జీవితాలను మారుస్తుంది’ అని ఎన్నికల్లో చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. అధికారంలోకి రాగానే 16 వేల మంది నిరుద్యోగులకు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధి కల్పించాం. సామాజిక పింఛన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచి నేరుగా ప్రజల చేతుల్లో పెట్టాం. గత ప్రభుత్వంలో అధ్వానంగా మారిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల రోడ్ల కోసం ₹13 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఆర్ అండ్ బీ రహదారుల గుంతలను పూడ్చి ప్రజా రవాణాను మెరుగుపరిచాం. ఈ అభివృద్ధి ప్రజల కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుండటంతో, తమకు ఎలాగూ ఓట్లు పడవని వైకాపా ముందే తేల్చుకుంది.
కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు వస్తాయని, తద్వారా లబ్ధి పొందవచ్చని వైకాపా కలలు కంది. కానీ కూటమి పార్టీలన్నీ ఒకే మాట, ఒకే బాటగా సమన్వయంతో ఎన్నికల బరిలోకి దిగడంతో కనీస స్థానాలు కూడా దక్కవనే నిరాశతో హింసా మార్గాన్ని ఎంచుకున్నారు. పుంగనూరు, తిరుపతి, రాయచోటి వంటి ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, భౌతిక దాడులకు పాల్పడి, తిరిగి తామే బాధితులమంటూ ప్రభుత్వంపై బురదజల్లుతూ ముసలి కన్నీరు కార్చడం వైకాపాకు అలవాటుగా మారింది. పుంగనూరులో వైకాపా గూండాలు సాగించిన విధ్వంసం అత్యంత హేయమైనది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు (మధుసూదన్ రెడ్డి / మధు రాయల్) పై విచక్షణారహితంగా దాడి చేసి తల పగలగొట్టారు. మక్బూల్ బాషా అనే కార్యకర్తపైకి ఉద్దేశపూర్వకంగా కారును దూకించి తీవ్రంగా గాయపరిచారు. మంజునాథ్ అనే వ్యక్తి చేయి విరగ్గొట్టగా, మోహన్ రెడ్డి అనే నాయకుడి తల పగలగొట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేసి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్య వాదాన్ని నమ్ముకుంటే.. వైఎస్సార్సీపీ మాత్రం రౌడీయిజాన్ని, హింసావాదాన్ని నమ్ముకుంది. ఈ దాడులు, బెదిరింపులతో ప్రజలను భయపెట్టలేరు. పుంగనూరుతో పాటు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గ ప్రజలు ఈ అరాచకాలను గమనిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగానైతే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైకాపాకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిని కల్పిస్తూ.. ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీకి శాశ్వత రాజకీయ సమాధి కట్టడం ఖాయం.
పుంగనూరు విధ్వంసానికి వైఎస్ జగనే పూర్తి బాధ్యత వహించాలి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరుగుతున్న హింసాకాండ, దాడులు అన్నింటికీ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. స్థానికంగా పోటీ చేయడానికి నాయకులు, కార్యకర్తలు ఎవరూ ముందుకు రాని నిస్సహాయ స్థితిలో ఉన్న వైకాపా, బలవంతపు నామినేషన్ల కోసం చేస్తున్న దౌర్జన్యాలు వారి పతనానికి నాంది అని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవమైతే, పోటీకి అభ్యర్థులను నిలబెట్టకపోతే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని వైఎస్ జగన్ సొంత పార్టీ నేతలనే బహిరంగంగా బెదిరించారు. ప్రజా వ్యతిరేకతతో నిరాశానిస్పృహల్లో ఉన్న వైకాపా నేతలు పోటీకి వెనుకంజ వేస్తుంటే, వారిని భయపెట్టి బలవంతంగా నామినేషన్లు వేయించే క్రమంలోనే ఈ స్థాయి హింసను ప్రేరేపిస్తున్నారు. హింస ద్వారానే తమ పార్టీ మనుగడను కాపాడుకోవాలని చూస్తే ప్రజలే ఆ పార్టీకి శాశ్వత సమాధి కడతారు. పుంగనూరులో జరిగిన దౌర్జన్యం ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. నామినేషన్లకు ఇంకా సమయం ఉండగా, ఉదయం 11 గంటలకు ప్రక్రియ మొదలయ్యే చోట 10:30 గంటలకే ఎంపీ కాన్వాయ్‌తో వచ్చి విధ్వంసం సృష్టించారు.
నామినేషన్ల తొలి రోజే, మొదటి గంటలోనే ఎన్నికల అధికారుల మీదకు వెళ్లి బెదిరింపులకు దిగడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే.. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టించి ఎవరూ నామినేషన్ వేయకుండా అడ్డుకోవడమే. మీడియాలో వస్తున్న దృశ్యాల్లో ఎన్నికల అధికారిని ఎలా బెదిరించారో, ప్రజలను కార్లతో ఎలా తొక్కిస్తూ దౌర్జన్యానికి దిగారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి కిరాయి రౌడీలను రప్పించి, వాహనాల్లో మారణాయుధాలతో మోహరించి భయోత్పాతం సృష్టించారు. కార్లతో ప్రజలను, ప్రత్యర్థి పార్టీ నాయకులను ఢీకొడుతూ రౌడీయిజం చెలాయించే సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఇలాంటి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమర్థవంతమైన అధికారులను నియమించి ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. బయట ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. హింసావాదం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసే వైకాపా కుట్రలు ఇకపై సాగవని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ధూళిపాళ్ళ నరేంద్ర హెచ్చరించారు.
నామినేషన్ల వేళ కార్లలో బీరు సీసాలు, ఇనుప రాడ్లా?.. పుంగనూరు విధ్వంసం వెనుక పక్కా కుట్ర
నామినేషన్లు వేసేందుకు వెళ్లే కార్లలో బీరు సీసాలు, ఇనుప రాడ్లు ఎందుకుంటాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడి ముందస్తు ప్రణాళికతో కూడిన పక్కా కుట్ర అని నిప్పులు చెరిగారు. నామినేషన్లు వేయడానికి వెళ్లే వాహనాల్లో కర్ణాటక నుంచి రౌడీలు, మద్యం సీసాలు, ఇనుప రాడ్లు ఎందుకు ఉన్నాయి? నామినేషన్ల తొలి రోజు, ప్రారంభమైన తొలి గంట కూడా కాకముందే ఎంపీ కాన్వాయ్‌తో వచ్చి దౌర్జన్యానికి దిగడం దేనికి సంకేతం? ఎవరైనా కార్యకర్తలు వెళ్లి అధికారులు ఫారాలు తీసుకోవట్లేదని చెబితే ఎంపీ రావడంలో అర్థం ఉంది. కానీ ఎవరూ రాకుండానే, ఆఫీసులు తెరవకముందే ఈ విధ్వంసానికి దిగారంటే.. మొదటి రోజే భయోత్పాతం సృష్టిస్తే మిగతా రెండు రోజులు ఎవరూ నామినేషన్లు వేయడానికి రారనే కుట్రతోనే ఈ దాడి చేశారు. గతంలో పుంగనూరు అత్యంత ప్రశాంతమైన నియోజకవర్గంగా ఉండేది. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రాంతాన్ని ఫ్యాక్షనిజానికి, రక్తపాతానికి కేంద్రంగా మార్చారు.
తాము అధికారంలో లేకపోయినా పాత పద్ధతుల్లోనే దౌర్జన్యాలు చేయవచ్చని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి గూండాయిజానికి ఎట్టిపరిస్థితుల్లోనూ తావులేదని, ఈ అరాచక సంస్కృతికి చరమగీతం పాడతామని హెచ్చరించారు. గతంలో గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే సొంత పార్టీ కార్యకర్తే మరణించినా కనీసం కారు ఆపి పరామర్శించని సంస్కృతి వైకాపాది. అలాంటి నైజం ఉన్న నాయకులకు ప్రజల ప్రాణాలన్నా, కార్యకర్తల భద్రత అన్నా ఏమాత్రం లెక్కలేదు. అధికారం, స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను కార్లతో తొక్కించడానికైనా, కార్యకర్తలను బలిపీఠం ఎక్కించడానికైనా వారు వెనుకాడరని నేటి ఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే తమ పార్టీకి ఉనికి ఉండదనే భయంతోనే వైకాపా ఇలాంటి హింసాకాండకు తెగబడుతోంది. బెదిరింపులతో ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తే ఆ ప్రాంత ప్రజలు ఓటు ద్వారా వైకాపా హింసావాదానికి శాశ్వత సమాధి కడతారని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.















