- ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి మరింత వేగం
- ప్రజాస్వామ్య పునాదులు బలపర్చేలా స్థానిక ఎన్నికల ఫలితాలు
- మేం విద్యాధికులను నిలబెట్టాం… వాళ్లు విధ్వంసకారులను ఎంపిక చేశారు
- అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు
- బీసీలకు పెద్దపీట.. విద్యావంతులు, యువత, మహిళలకు అవకాశం
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
రాష్ట్రంలో అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే స్థానిక సంస్థల్లోనూ ఎన్డీఏ కూటమికి ప్రజలు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు ఒకే తాటిపై ఉంటేనే ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యమిస్తూ, విద్యావంతులు, యువత, మహిళలకు అవకాశాలు కల్పించేలా అభ్యర్థుల ఎంపిక చేపట్టామని వెల్లడించారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసేందుకు స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అమరావతి (చైతన్య రథం): స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు ఒకే తాటిపై ఉంటేనే అభివృద్ధి వేగంగా సాగుతుందని, ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. స్థానిక ఎన్నికలతో స్థానిక నాయకత్వం బలపడుతుందని, ప్రజాస్వామ్య పునాదులు పటిష్టమవుతాయని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలకు అందించి, మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వెల్లడించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ఎలాంటి కసరత్తు చేశామో, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదేస్థాయిలో కసరత్తు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజల అభీష్టానికి ప్రాధాన్యమిస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించేలా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయారాం.. గయారాం సంస్కృతికి చరమగీతం పాడేలా, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు.
అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు
అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలిపి 63.6 శాతం స్థానాలు కేటాయించగా, ఒక్క బీసీలకే 35 శాతానికి పైగా సీట్లు ఇచ్చి పెద్దపీట వేశామని వెల్లడించారు. విద్యావంతులు, యువత, మహిళలు, పార్టీకి సేవలందించిన వారికి టికెట్లు ఇచ్చామని చెప్పారు. ఒక్కో మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించినట్లు వివరించారు.
విద్యావంతులు వర్సెస్ గంజాయి బ్యాచ్
స్థానిక ఎన్నికల్లో విద్యావంతులు, సమర్థులైన అభ్యర్థులను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. ఈ ఎన్నికల్లో పోటీ విద్యావంతులకు, గంజాయి బ్యాచ్‌కు మధ్య జరుగుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలది ప్రజాస్వామ్య అజెండా అయితే, వైసీపీది హింసాత్మక రాజకీయమని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంటే, దాన్ని అడ్డుకునేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా ఆ పార్టీ తీరు మారలేదని విమర్శించారు. రాబోయే 20 ఏళ్లు రాష్ట్రానికి అత్యంత కీలకమని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం 20 ఏళ్లు రాష్ట్రానికి అత్యంత కీలకమని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, అభివృద్ధి కొనసాగేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.













