- ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం వాటిల్లిందని, మురసు తుఫాను కారణంగా ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. తుఫాను నష్టం నుంచి ఉపశమనం కోసం తక్షణం మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం లేఖ రాశారు. వారం వ్యవధిలోనే రెండు వరుస తుఫాన్లతో ఏపీపై తీవ్ర ప్రభావం పడిందని సీఎం పేర్కొన్నారు. భారీ వర్షాలు, తీవ్ర గాలుల కారణంగా విద్యుత్, రహదారుల లాంటి మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయని వివరించారు. అక్టోబరు 27న అర్నబ్ తుఫాను వల్ల జరిగిన నష్టం నుంచి రాష్ట్రం కోలుకుంటున్న సమయంలోనే మురసు తుఫాను విరుచుకుపడటంతో రైతులు, మత్స్యకారులు ఒకే సీజనులో రెండుసార్లు నష్టపోయారని తెలిపారు. వరద నీరు తగ్గిన తర్వాత నష్టాలపై పూర్తిస్థాయి అంచనాలు నిర్వహించి మరో 15 రోజుల్లో సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
తక్షణ సాయంతో రాష్ట్రానికి ఉపశమనం
మురసు తుఫాను కారణంగా వ్యవసాయ రంగంలో 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 1,86,063 మంది రైతులు ప్రభావితం అయ్యారని ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్ల నష్టం వాటిల్లిందని… ఉద్యాన పంటలు 6,504.38 హెక్టార్లలో దెబ్బతినగా, 12,178 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. ఈ రంగానికి రూ.337.10 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. దీంతో పాటు పశుసంవర్థక, ఆక్వా, గృహ నిర్మాణం, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, విద్య, వైద్యారోగ్య శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆస్తి నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగామని వివరించారు. మురసు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, మత్స్యకారులు, గృహాలు దెబ్బతిన్న కుటుంబాలు, ఇతర బాధిత వర్గాలను ఆదుకోవడానికి, రాష్ట్రంలో దెబ్బతిన్న అత్యవసర మౌలిక సదుపాయాలు, సేవలను పునరుద్ధరించడానికి కేంద్ర హోం శాఖ తక్షణం మధ్యంతర ఆర్థిక సాయం మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్రం నుంచి తక్షణ సహాయం అందితే బాధితులకు ఉపశమనం కల్పించడంతో పాటు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోగలమని స్పష్టం చేశారు.


















