- రూ.వేల కోట్ల కేంద్ర నిధులను దారిమళ్లించి పప్పుబెల్లాల్లా వాడేశారు
- పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకూ పైసలు లేకుండా చేసిన పాపం గొడ్డలిపార్టీదే
- సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్ల దోపిడీ
- రూ.3,000 కోట్ల ఉపాధి హామీ నిధులు బొక్కేసిన వైసీపీ కార్యకర్తలు
- వైసీపీ కేడర్ నే వాలంటీర్లుగా నియమించి పల్లెల్లో అరాచకం
- చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ తీసేస్తామంటూ వారితో బెదిరింపులు
- గ్రామీణ ప్రాంతాల్లో ఓటడిగే అర్హత ఆ పార్టీకి లేదు
- కూటమి పాలనతో వీడిన గ్రహణం, గ్రామాల్లో మొదలైన వికాసం
- మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు
అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ విన్న తర్వాత, మనం చూస్తోంది మనం వింటోంది మనకందరికీ తెలిసిన జగన్ మోహన్ రెడ్డేనా లేక మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్బంధాలను ఎదుర్కొన్న ఆంగ్ సాన్ సూకీనా అనే సందేహం ప్రజలందరికీ రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ గత చరిత్ర, ఆయన పార్టీ నైజం, ఆయన చేసిన విధ్వంసకర పాలన గురించి తెలియని ఏ అమాయకుడైనా ఆ ప్రెస్ మీట్ వింటే నిజంగానే ప్రజాస్వామ్య హక్కుల కోసం జగన్ ఇంతలా తల్లడిల్లిపోతున్నాడా అని ఆశ్చర్యపోతారని, కానీ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అసలు రూపం ఏంటో స్పష్టంగా తెలుసని ఆయన స్పష్టం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ అంటే ఏంటో, ఆయన విధానాలు ఏంటో, ఐదేళ్ల పాటు సాగించిన అరాచక పాలన ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుసు. న్యాయవ్యవస్థపై దాడి చేయడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం లాంటి నియంతృత్వ పోకడలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వ్యక్తి… నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
నాడు అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు వైసీపీ శ్రేణులు ప్రదర్శిస్తున్న ఉన్మాదం గురించి, ఆ ఉన్మాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి వైఖరి గురించి ప్రజలకు తెలియనిది కాదు. ప్రజాస్వామ్య సంస్థలను ధ్వంసం చేసిన చరిత్ర జగన్‌ది కాదా? 2019 ఎన్నికలకు ముందు ఏ అబద్ధపు ప్రచారాలనైతే ఎంచుకున్నారో, నేటికీ జగన్ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఒకే అబద్ధాన్ని 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు చెబితే ప్రజలు నిజమని నమ్ముతారనే భ్రమల్లో ఆయన బతుకుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డుపై తిరుగులేని స్పష్టత ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి, ఇవాళ ప్రజాస్వామ్య ముసుగు వేసుకుని బుకాయించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకోరని అప్పసాని రాజేష్ హెచ్చరించారు.
151 నుంచి 11 సీట్లకు పాతరేసినా జగన్‌కు జ్ఞానోదయం కాలేదా?
2019 ఎన్నికల ముందు వైసీపీ సొంత మీడియా, పెయిడ్ సోషల్ మీడియా, కిరాయి మేధావుల ముసుగులో కొందరు వ్యక్తులు చేసిన అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అడిగిన దానికంటే ఎక్కువ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. కానీ పాలకుడిగా ఆయన ఐదేళ్ల విధ్వంసకర పాలన, మనస్తత్వాన్ని చూసిన తర్వాతే 2024 ఎన్నికల్లో రాష్ట్ర పౌర సమాజం 151 సీట్ల నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని విధంగా 11 సీట్లకు పరిమితం చేసి కర్రు కాల్చి వాత పెట్టింది. అంతటి ఘోర పరాభవం ఎదురైనా, జగన్ ఇంకా పాత చింతకాయ పచ్చడి అబద్ధాలనే నమ్ముకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని అప్పాసాని రాజేష్ నిప్పులు చెరిగారు. మా పాలన సువర్ణయుగం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ప్రెస్ మీట్లో జగన్ పదేపదే చెప్పుకోవడం ఆయన రాజకీయ అజ్ఞానానికి, మానసిక స్థితికి నిదర్శనం.
ప్రజలకు చేసిన మోసం తెలిసే కదా 2024లో చిత్తుచిత్తుగా ఓడించింది? అలాంటి వ్యక్తి నేడు ప్రజా తీర్పుతో ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని, సూపర్ సిక్స్ పథకాలను ప్రశ్నించడం హాస్యాస్పదం. తన మేనిఫెస్టోను 98% అమలు చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్న జగన్, రాష్ట్రంలో సగభాగమైన మహిళలకు ఇచ్చిన ‘పూర్తి మద్యనిషేధం’ హామీని ఎందుకు తుంగలో తొక్కారు? ‘మద్యనిషేధం అమలు చేయకపోతే 2024లో ఓట్లే అడగను’ అని చెప్పిన జగన్ మాట తప్పారా? లేదా? ప్రభుత్వ మద్యం దుకాణాల ముసుగులో జే-బ్రాండ్లు తెచ్చి, 30 వేల మంది ప్రాణాలు గాల్లో కలవడానికి, లక్షలాది కుటుంబాలు రోడ్డున పడటానికి కారకుడు కాదా? మాట తప్పి, మడమ తిప్పి మహిళా లోకాన్ని మోసం చేసినందుకే అక్కాచెల్లెమ్మలు 2024లో జగన్‌ను రాజకీయంగా సమాధి చేశారు. ఎన్నికల ముందు కాలేజీలు, యూనివర్సిటీల చుట్టూ ‘యువభేరి’ సదస్సులు పెట్టి రాష్ట్ర యువతను జగన్ దారుణంగా వంచించారు.
మెజారిటీ ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికి, ఎంపీలను గెలిపిస్తే ఐదేళ్ల పాటు సొంత కేసుల మాఫీ కోసం ఢిల్లీకి తాకట్టు పెట్టలేదా? దావోస్ పర్యటనలు అక్కర్లేదు, సీఐఐ సదస్సులు అక్కర్లేదని ప్రగల్భాలు పలికిన జగన్… ఐదేళ్లలో ఏ ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? ఉన్న పరిశ్రమలను తరిమికొట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టలేదా? ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాలు, మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగ యువత జీవితాలతో ఐదేళ్లు చెలగాటమాడింది వాస్తవం కాదా? ఒకే అబద్ధాన్ని పదిసార్లు, వందసార్లు చెబితే నిజమైపోతుందనుకోవడానికి ఇది 2019 కాదు, 2026. జగన్ మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు, ఆయన చేసిన దగాపై రాష్ట్ర ప్రజలకు, యువతకు తిరుగులేని స్పష్టత ఉంది. ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాలు మాని, ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని అప్పసాని రాజేష్ హితవు పలికారు.
ఉద్యోగులను నట్టేట ముంచి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్… కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమా?*
ప్రభుత్వోద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసి, రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి, రాజధాని అమరావతిని అస్థిరపరిచిన గత పాలకుడు జగన్ మోహన్ రెడ్డి… నేడు సిగ్గులేకుండా సూపర్ సిక్స్ హామీల అమలుపై మా కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం హాస్యాస్పదమని అప్పసాని రాజేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో జరిగిన నయవంచన, కూటమి ప్రభుత్వ సంక్షేమం-అభివృద్ధిపై వాస్తవాలను ఆయన ఎండగట్టారు. 2019 నాటి అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను 2022 దాకా సాగదీసి, అప్పటివరకు ఉన్న 27% ఐఆర్ కన్నా తక్కువగా 23% ఫిట్మెంట్తో ఉద్యోగుల గొంతు కోశారు. హెచ్ఆర్ఏ స్లాబులు కుదించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం ఇవ్వకుండా వేధించారు. ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఒక్కటంటే ఒక్క డీఏ కూడా మంజూరు చేయని ఏకైక దుర్మార్గపు పాలకుడు జగన్.
వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని, పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇస్తానని చెప్పి నట్టేట ముంచారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించి, అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని రాజధాని లేని దిక్కులేని స్థితికి తెచ్చారు. రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారం, ఏడాదికి రూ. 60 వేల కోట్ల వడ్డీలు-అసలు చెల్లింపుల వంటి ఆర్థిక విధ్వంసం వారసత్వంగా దక్కినా… పదవీ బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లోనే ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 63 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ. 2,700 కోట్ల చొప్పున ఇప్పటివరకు ఏకంగా రూ. 79 వేల కోట్లను పెన్షన్ల కోసం వెచ్చించాం. వృద్ధులు, వితంతువులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000, డయాలసిస్ బాధితులకు రూ. 10,000, పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ. 15,000 పెన్షన్ ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాం.
ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ వర్తింపజేస్తూ తల్లికి వందనం అమలు చేస్తున్నాం. గతంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికే అదీ కోతలు పెట్టి రూ. 13,000 ఇచ్చిన జగన్ మాకు పాఠాలు చెబుతారా? పీఎం కిసాన్ నిధులకు అదనంగా జగన్ ఇచ్చింది కేవలం రూ. 7,500 అయితే, నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర నిధులతో కలిపి ఏటా రూ. 20,000 (రాష్ట్ర వాటా రూ. 14,000) రైతులకు నేరుగా అందిస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటికే 5 కోట్ల 10 లక్షల ఉచిత సిలిండర్లు అందించగా, దీనికి రూ. 3,942 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఇప్పటికే 101 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగించారు. ఆర్టీసీకి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ. 3,550 కోట్లను రీయింబర్స్ చేసింది. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి లక్ష్యంగా ఇప్పటికే సుమారు రూ. 23-24 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నాం. దేశం మొత్తంలో నమోదైన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 25.3% వాటాతో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది.
24 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించి, క్యాబినెట్ అనుమతులతో పరిశ్రమలను వేగంగా గ్రౌండింగ్ చేయిస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్ల పునర్నిర్మాణానికి వేల కోట్ల నిధులు కేటాయించాం. ‘పల్లె పండుగ 1.0, 2.0, 3.0’ ద్వారా దాదాపు రూ. 23,000 కోట్లతో గ్రామీణ రహదారులను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వ పాలనను మెచ్చి సాధారణ ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలే… మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ అదే చారిత్రక తీర్పును పునరుద్ఘాటించారు. రేపు జరగబోయే పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీని తుంగలో తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తమపై ఉన్న నమ్మకంతో కూటమికి ఘన విజయం కట్టబెడుతుంటే… తట్టుకోలేక రిగ్గింగ్‌లు, అరాచకాలు అంటూ జగన్ అబద్ధాలతో నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అప్పసాని రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఆత్మవంచన మానుకుని ప్రజా తీర్పును శిరసావహించాలని ఆయన హెచ్చరించారు.
హింస, పెట్రోల్ బాంబుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మీరే జగన్ మోహన్ రెడ్డి
రాష్ట్రంలో హింసను, అరాచకాన్ని బహిరంగంగా ప్రేరేపిస్తోంది మీ ఎంపీ మిథున్ రెడ్డి. నేటికీ తెలుగుదేశం శ్రేణులపై పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తోంది మీ పార్టీ గూండాలే. దౌర్జన్యాలకు, బూత్ క్యాప్చరింగ్లకు పేటెంట్ హక్కు మీ రక్తంలోనే ఉంది మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి అని అప్పసాని రాజేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని తేలిపోవడంతోనే జగన్ మీడియా ముందుకు వచ్చి ‘విక్టిమ్ కార్డు’ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 2004 ఎన్నికల సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌ను ఒక్కసారి తిరగేస్తే ఆయనపై నమోదైన బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, దౌర్జన్యాలు, పోలీసులను బెదిరించిన కేసులు రాష్ట్ర ప్రజలకు కనిపిస్తాయి. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైనా అలాంటి అరాచకపు కేసులు ఉన్నాయా? ప్రజాస్వామ్య స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న నాయకత్వం మాది.
దశాబ్దాలుగా హింస, దాడులు, అక్రమాలనే రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది, వైసీపీది కాదా? శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో వైసీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా వేలాది ఎంపీటీసీ, వందలాది జెడ్పీటీసీ నామినేషన్లు వేశారు. నేను పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గ అబ్జర్వర్‌గా క్షేత్రస్థాయిలో పర్యటించాను. తెనాలి రూరల్ మండల పరిధిలోని 21 ఎంపీటీసీ సెగ్మెంట్లలో, అక్కడ ఉన్న 79 పోలింగ్ బూతుల్లోనూ వైసీపీ ఏజెంట్లు కూర్చున్నారు. వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకున్నారు, ప్రజలను ఓట్లు అడిగారు, ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొన్నారు. మరి అరాచకం రాజ్యం ఏలుతుంటే, నామినేషన్లు వేయనివ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా వేల మంది వైసీపీ అభ్యర్థులు ఎలా బరిలో నిలిచారు? 79 బూతుల్లో మీ ఏజెంట్లు ఎలా కూర్చున్నారు?
ఓడిపోతామని తెలిసే ఇప్పుడు మీడియా ముందు ఈ దొంగ ఏడుపులు ఎందుకు? ప్రజల నుంచి మీకు దక్కుతున్నది అన్యాయం కాదు మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి, ముమ్మాటికీ ప్రజా తిరస్కారం. ఒకే పడికట్టు అబద్ధాలు, అదే విక్టిమ్ కార్డు డ్రామాలు ఎల్లకాలం చెల్లవని గుర్తించండి. ఇవన్నీ పనికిరాని ఔట్‌డేటెడ్ వ్యూహాలు. ఎందుకు ప్రజలు మిమ్మల్ని పదేపదే ఛీత్కరిస్తున్నారో మీ పార్టీలో కూర్చుని ఆత్మవిమర్శ చేసుకోకపోతే… రాబోయే ప్రతి ఎన్నికలోనూ ప్రజలు ఇంతకంటే ఘోరమైన పరాభవాన్ని మిగిలిస్తారు. కార్యకర్తల్లో కనీస విశ్వాసాన్ని, స్ఫూర్తిని నింపలేని అసమర్థ నాయకత్వం జగన్‌ది. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకున్న వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికే మేల్కొన్నారు. భవిష్యత్తులో జగన్ వెంట నడవడానికి సొంత పార్టీ కేడర్ కూడా సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం నుంచి ‘జగన్ ఫ్యాక్టర్’, వైసీపీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు.


















