- లేళ్ళ అప్పిరెడ్డి చట్టవిరుద్ధంగా వ్యవహరించారు*
- ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామనే భ్రమలో వైసీపీ నాయకులు ఉన్నారు*
- ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
అమరావతి (చైతన్యరథం): ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం లేకపోవడమే కాకుండా రాజ్యాంగం, ఎన్నికల విధానంపై గౌరవం లేని పార్టీ వైసీపీ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వెంగళాయపాలెంలో జరిగిన సంఘటనను రాజకీయ ప్రయోజనం కోసం వక్రీకరించి చూపించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా ఒక నాయకుడి పాత్ర ఎలా ఉండాలో లేళ్ల అప్పిరెడ్డికి తెలియదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో భారీ సంఖ్యలో వ్యక్తులతో వెళ్లడం, అధికారులు, పోలీసుల పనిలో జోక్యం చేసుకోవడం సరైన ప్రవర్తన కాదని విమర్శించారు.
ఏదైనా తప్పు జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి, ఎన్నికల కమిషన్ ముందు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను తరలించడం, ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు కలిగించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారికి అధికారులు, పోలీసుల నుంచి సమాచారం తెలుసుకోవడమే సరైన మార్గమని, దానికి బదులుగా రాజకీయ ప్రదర్శనకు దారితీసే వ్యవహారాలు చేయడం తప్పని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తోందని, అయితే వైసీపీ దానిపై అనవసరమైన దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నికల కమిషన్‌పై గౌరవం లేకపోయిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగాయని తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు తమ తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఇచ్చే రిఫరెండమని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామనే భ్రమలో ఉన్నారని, కానీ సమాజానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. చట్టం తన పని చేస్తుందని, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే ఏ ప్రయత్నానికీ అనుమతి లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాపాలనను గౌరవించాలని, ఎన్నికల విధానానికి అవమానం కలిగించే చర్యలను విరమించుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైసీపీని కోరారు.




















