- ఓటమి భయంతో పథకం ప్రకారం పల్నాడులో టీడీపీ నేతలపై దాడులు
- టీడీపీ మద్దతుదారులను అడ్డుకుని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులు
- దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎసఈసీ)కు ఫిర్యాదు చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్‌లతో కూడిన బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఈ మేరకు సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. పిడుగురాళ్ల మండలం, చెన్నాయపాలెంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేసి తిరిగి వెళ్తున్న టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడటంతో పాటు, అక్కడే ఉన్న టీడీపీ ఎంపీపీ గండికోట వెంకటేశ్వర్లు కారును తీవ్రంగా ధ్వంసం చేశారని వారు తెలిపారు. మాచవరం మండలం, వేమవరంలో నామినేషన్లు వేసి తిరిగి వెళ్తున్న టీడీపీ మద్దతుదారులను దారిలో అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయవద్దని, వేసిన నామినేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు గురిచేశారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పిడుగురాళ్ల మండలం, కార్లపాళెం నామినేషన్ కేంద్రం వద్ద భద్రత కల్పిస్తున్న పోలీసులపైనే వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయని టీడీపీ బృందం ఆరోపించింది. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకుని భయాందోళనలు సృష్టించేందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారని, అయితే పోలీసులు వెంటనే స్పందించి గుంపును చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వారు వివరించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పథకం ప్రకారమే ఈ దాడులు జరుగుతున్నాయని, తద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతలు వివరించారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు, ఫోటోలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఆధారాలుగా కమిషనర్‌కు సమర్పించారు. దాడులకు పాల్పడిన బాధ్యులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను టీడీపీ నేతలు కోరారు.




















