- ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం
- 20మందికి గాయాలు
- సీఎం చంద్రబాబు నాయుడు ఆరా
- బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ జిల్లా బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 20మంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, ఘటనపై అధికారులను ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో విచారించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీనుండి పరిహారం అందేలా చూడడంతోపాటు ప్రభుత్వం నుండి సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్
సిమెంట్ పరిశ్రమలో పేలుడు ఘటనపై కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ప్రీ హీటర్ లోపంతోనే పేలుడు సంభవించినట్టు తెలిసిందన్నారు. నిర్వహణా జాగ్రత్తలో సంస్థ విఫలమైందన్నారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.