- రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు
అమరావతి (చైతన్యరథం): పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించడం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పరిశ్రమ హోదా ఇవ్వడంతో పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్లయిందని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో నూతన టూరిజం పాలసీపై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్రంగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పేరు నిలిచి పోతుందన్నారు. ప్రపంచంలోనే అద్భుత పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా ఏపీలో 20 శాతం పైబడి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
ఈ క్రమంలో బాధ్యతాయుతమైన పర్యాటకం, టూరిజంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక జన సమూహాలను బలోపేతం చేయాలన్న దార్శనికతతో ఈ టూరిజం పాలసీని రూపొందించామని వివరించారు. దేశానికి విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా నిలపాలని భావిస్తున్నామని తెలిపారు. పర్యాటకులు కనీసం ఐదు రోజులు ఉండే విధంగా టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
రాష్ట్రంలో టూరిజం హోటళ్లలో ప్రస్తుతం 3,500 రూములు ఉన్నాయని చెబుతూ, వాటి సంఖ్యను 10 వేలకు పెంచాలని యోచిస్తున్నామన్నారు. పర్యాటక రంగంలో పీపీపీ విధానంలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఒకే తరహా పర్యాటకాభివృద్ధి కాకుండా అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్నెస్, అగ్రి టూరిజం తరహాలో పర్యాటక విధానాలు నెలకొల్పాలని భావిస్తున్నామన్నారు.
డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో ఏడు యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి – నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయమన్నారు.
అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు, తదితర ఆలయాలను కలిపేలా 10 సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక కోస్టల్ టూరిజం సర్క్యూట్లో భాగంగా వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నంలలో ఐదు బీచ్ సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రివర్ టూరిజం సర్క్యూట్‌తోపాటు 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం- విశాఖపట్నం, తూర్పు గోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ రంగంలో సైతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తామన్నారు. పర్యాటకానికి సంబంధించిన ప్రాజెక్టులు ఆరు కేటగిరీలుగా విభజన చేస్తున్నామన్నారు. పర్యాటక ప్రాజెక్టుల్లో భద్రతా చర్యలు, ప్రమాణాలు దృష్టిలో పెట్టుకొని వృద్ధి చేస్తామని చెప్పారు. ఆపరేటింగ్ గైడ్ లైన్స్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు.