- ప్రతి కుటుంబానికి శాశ్వత చిరునామా కల్పిస్తున్నాం
- దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతున్నాం
- గత పాలకులు భూ కబ్జాలకు పాల్పడితే.. నేడు కూటమి ప్రభుత్వం పట్టాలు ఇస్తోంది
- కూడు, గూడు, గుడ్డ.. ఇదే మా ప్రభుత్వ నినాదం
- సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్నాం
- విశ్వనగరంగా విశాఖపట్నం… అభివృద్ధి ఇక ఆగదు
- విశాఖలో పేదలకు పట్టాల పంపిణీలో సీఎం చంద్రబాబు
- 28,445 మందికి ఇళ్ల పట్టాలతో లబ్ధిదారుల్లో ఆనందం
- రూ.8,874 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కులు
విశాఖపట్నం(చైతన్యరథం): దశాబ్దాలుగా ఇళ్లపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లాలో ని 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టాలు పంపిణీ చేశారు. విశాఖలోని 11 మండలాల్లో 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించడంతోపాటు మొత్తం 19,33, 853 చదరపు గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో కొందరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా పట్టాలు అందజేశారు. రూ.8,874 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కు కల్పిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. దాంతో పట్టాలు అందుకున్న కుటుంబాల్లో సంతోషం నెలకొంది.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పేదలకు పట్టాభిషేకం చేస్తున్నాం. వారి ఇళ్లపై సర్వహక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్లూ మీ ఇళ్లపై మీకు హక్కు లేదనే బాధ ఉండేది.. దశాబ్దాల ఆందోళనకు ఇవాళ ముగింపు పలుకుతున్నామని చెప్పారు. ఇక మీ ఇళ్లపై వివాదం లేదు..భయం లేదు.. హక్కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కన్వెయన్స్ డీడ్స్ ఇస్తున్నాం… రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఈ భూముల విలువ రూ.8,874కోట్లు ఉంటుంది. మార్కెట్ విలువ మరింత రూ.8,874కోట్లు ఉంటుంది. మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుంది. భూమి విలువ పెరిగిందని అమ్ముకోవద్దు. ఈ భూమే మీకు భరోసా… ధైర్యమని తెలిపారు. 2024ఎన్నికల్లో ప్రజలువేసిన ఓటు వేలాది కుటుం బాలకు కూటమి ప్రభుత్వం ఆస్తి హక్కును కల్పించింది. ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్ర పునర్ని ర్మాణానికి ఒక్కో ఇటుకా పేరుస్తున్నాం. విధ్వంసం నుంచి వికాసం వైపు.. భయం నుంచి భరోసా వైపు.. నిరాశ నుంచి కొత్త ఆశల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తు న్నాం. ఇది పట్టాల పంపిణీ మాత్రమే కాదు.. పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం. హక్కులకు, పిల్లల భవిష్యత్తుకు పట్టాభిషేకమని తెలిపారు.
పంచ గ్రామాల సమస్యకు త్వరలో పరిష్కారం
కూడు, గూడు, గుడ్డ.. ఇదే మా ప్రభుత్వ నినాదం. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. ఇంటి జాగా ఇస్తాం.. ఇల్లు కట్టిస్తాం.. ప్రతి కుటుంబానికి శాశ్వత చిరు నామా కల్పిస్తాం. రెండేళ్లలో 5 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించాం. వచ్చే మార్చిలోగా మరో 5 లక్షలకు పైగా ఇళ్లు అందిస్తాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కూటమి ప్రభుత్వ విధానం. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తాం. ఇంకా 22వేల మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది.. వారందరికీ త్వరలో పట్టాలు అందించేలా చర్యలు తీసు కుంటాం. మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రెవెన్యూ సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తున్నాం. వివిధ జిల్లాల్లో ఇప్పటికే 12వేల కుటుం బాలకు భూములను క్రమబద్ధీకరించి పట్టాలు ఇచ్చామని చెప్పారు.
కాబోయే విశ్వనగరం విశాఖ…
విశాఖ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటని ఉద్ఘాటించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగామని చెప్పారు. విశాఖ కాబో యే విశ్వనగరమని, అభివృద్ధి ఫలాల్లో పేదలకూ భాగస్వామ్యం ఉండేలా చూడ టం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. విశాఖను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలని సూచించా రు. రాష్ట్రవ్యాప్తంగా 145 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను తొలగించామని తెలిపారు. తిరుమలలో 89.4శాతం పచ్చదనం ఉన్నట్లే విశాఖలోనూ పచ్చద నాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. విశాఖ అభివృద్ధికి అన్నిరకాలుగా కృషిచేస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం సహ కరించిందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. విశాఖఅభివృద్ధి ఇక ఆగదనిస్పష్టం చేశారు.
రాష్ట్రంపై ఎల్సినో ప్రభావం తీవ్రం
ఎల్నినో ప్రభావంతో విశాఖలో తాగునీటి ఇబ్బందులు తలెత్తు తున్నాయని తెలిపారు. విశాఖకు వచ్చిన వెంటనే తాగునీటి పరిస్థితిపై సమీక్షించానని, సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలవరం ద్వారా గోదావరి జలాలను విశాఖకు తీసుకొచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూస్తామని చెప్పారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు తీసుకొచ్చామని, వాటిని వంశధారకు అనుసంధానించే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురానికి నీరందిస్తున్నామని తెలిపారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు
గత ప్రభుత్వ హయాంలో విశాఖలో భూ వివాదాలు, కూల్చి వేతలు, ఇతర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శిం చారు. గత పాలకులు భూ కబ్జాలకు పాల్పడితే.. నేడు కూటమి ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేస్తోందన్నారు. రుషికొండలో నిర్మించిన భవనాల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుని ప్రజలకు ప్రయోజనం కలిగేలా చేస్తామని తెలి పారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తీసు కొస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని, డేటా సెంటర్ల విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజలకు తాగు నీరు, పరిశ్రమ లకు అవసరమైన నీరు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, అచ్చెన్నాయుడు, బాలవీరాంజనేయ స్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.












