- ఢిల్లీ మద్యం స్కాంలో భారతి పాత్ర
- బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసు వెనక ఓ జంట ఉందని, దర్యాప్తు మరింత లోతుగా జరిగితే ఆ విషయం బయటకు వస్తుందంటూ పరోక్షంగా జగన్రెడ్డి, భారతిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకేసును సీబీఐ 90 శాతం ఛేదించిందన్న ఆయన మిగిలిన 10 శాతం పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందన్నారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కి అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ప్రజలకు 25 శాతం డబ్బులు పంచిన జగన్.. మిగతావి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే వివేకా హత్య కేసుతోపాటు కోడికత్తి కేసు విషయాన్ని కూడా ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.
రాజధాని అమరావతి పనులు ఆపేసి, మూడు రాజధానుల డ్రామా ఆడారని.. ఎర్ర చందనం, ఇసుక, మైనింగ్ మాఫియాతో దోపిడీ చేశారని ఆది నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశాడన్నారు. చేసిన తప్పులు దిద్దుకోకుండా.. సిగ్గు లేకుండా ప్రజలపై నిందలు వేస్తున్నాడన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా జగన్తో ఉండరన్నారు. వైసీపీని బీజేపీకి దాసోహం చేయడం ఖాయమన్నారు. జగన్ సతీమణి భారతికి ఢిల్లీ లిక్కర్ కేసులో పాత్ర ఉందన్నారు. ఈ కేసులపై విచారణ చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు. జగన్, అవినాష్ రెడ్డిల బెయిల్ రద్దు చేసేలా కోర్టు లో వాదిస్తామన్నారు. కూటమి సారధ్యంలో ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపుతామన్నారు. పవన్ కల్యాణ్ కూటమి కలయికలో కీలక పాత్ర పోషించారని.. ఆయనకు ఆది నారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.