అమరావతి: రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో సమన్వయంపై దృష్టి సారించాయి. ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహంచనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరం వేదికగా నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి పొత్తుపై ప్రకటన చేశారు. ఆ మేరకు ఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ నెల 29 నుండి 31 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు పార్టీల జిల్లా నేతల సమావేశాలు జరగనున్నాయి.
ఇందు కోసం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఇద్దరు సీనియర్ నేతలను సమన్వయ కర్తలుగా నియమించారు. వీరి పర్య వేక్షణలో ఈ సమావేశాలు జరుగుతాయి. సమావేశాల్లో గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు, ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర యువతకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం, కరవు పరిస్థితులు, సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహం, ధరల బాదుడుతో ప్రజలపై పడుతున్న భారాలు, మధ్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యం అమ్మకాలతో రూ.లక్ష కోట్లు దోచు కోవడమే కాకుండా, వేలాది మంది మహిళల మాంగల్యాలు తెంచుతున్న వైనం గురించి గడప గడపకూ వివరిం చేలా కార్యాచరణ చేపట్టనున్నాం. ఇరు పార్టీ నేతల అభిప్రాయాలు, సలహాలు సూచనలతో పాటు భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా ఉమ్మడిగా చర్చించాలని నిర్ణయించాము. ఆయా జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించే తేదీలను అచ్చెన్నాయుడు తెలిపారు.